అయోధ్యకు చంద్రబాబు.. ప్రచారం మిస్సయిందా..!
దేశంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అయోధ్య రామమందిర పునఃప్రతిష్టా కార్యక్రమాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
దేశంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అయోధ్య రామమందిర పునఃప్రతిష్టా కార్యక్రమాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయోధ్యలో నూతనంగా నిర్మిం చిన ఆలయంలో బాల రాముని విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి దేశంలోని పలువురు కీలక నాయకులను అయోధ్య రామజన్మభూమి ట్రస్టు ఆహ్వానించింది. వాస్తవానికి కేంద్రంలోనిబీజేపీ సర్కారే తెరవెనుక ఉండి.. ఇవన్నీ చేస్తోందని అంటున్నారు.
ఈ క్రమంలో ఏపీకి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబును కూడా అయోధ్య కు ఆహ్వానించారు. ఆయన తన పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడితో కలిసి అయోధ్యకు వెళ్లారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బాబు ఢిల్లీకి వెళ్లి.. అక్కడ నుంచి అయోధ్యకు చేరుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం.. ఆయన తిరిగి రానున్నారు. నిజానికి ఇప్పుడు ఎన్నికల సమయంలో క్షణం కూడా తీరికలేకుండా.. చంద్రబాబు గడుపుతున్నారు.
ఒకవైపు అభ్యర్థుల ఖరారు అంశాన్ని ఫైనల్ చేయాల్సి ఉంది. మరోవైపు పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రా.. కదలిరా! సభల షెడ్యూల్ కూడా జరుగుతోంది. ఇంకోవైపు.. వచ్చే నేతలను చేర్చుకోవాల్సి ఉంది. ఇవన్నీ ఇలా.. ఉంటే క్షేత్రస్థాయిలో టీడీపీ-జనసేన మిత్రపక్షాన్ని విజయవంతంగా ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ.. ఇంత బిజీగా ఉన్నప్పటికీ..చంద్రబాబు మాత్రం అయోధ్యకు తరలి వెళ్లారు.
దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఒకటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకుని, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలనే వ్యూహం. రెండు రాష్ట్రంలోని హిందూ సామాజిక వర్గాన్ని తనవైపు ఆకర్షించుకోవడం ద్వారా.. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలనే వ్యూహం ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యూహాలు బాగానే ఉన్నప్పటికీ.. చంద్రబాబు అయోధ్య పర్యటనకు సంబంధించిన ప్రచారం మాత్రం పెద్దగా లేక పోవడం గమనార్హం. ఆయన వెళ్తున్న విషయం కూడా.. రాష్ట్ర ప్రజల్లో సగం మందికి కూడా తెలియదు. మరి ఎప్పుడూ లేనిది .. ఇంత గోప్యంగా ఎందుకు వెళ్తున్నారనేది కూడా ఆసక్తిగా మారింది.