అప్పలనాయుడూ ఫ్లైట్ టికెట్ తీశావా? లేదంటే మనోళ్లు బుక్ చేస్తారన్న బాబు

అయినప్పటికి తనకున్న లెక్కలతో అప్పలనాయుడుకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు.

Update: 2024-06-07 05:18 GMT

తాజాగా ఫలితాలు వెల్లడైన ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా ఎన్నికయ్యారు అప్పలనాయుడూ. సామాన్య కార్యకర్తగా.. ఆర్థికంగా బలం లేని ఆయనకు విజయనగరం ఎంపీ టికెట్ ఇవ్వటంపై పెద్ద చర్చనే జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా బలం లేని వారికి టికెట్ ఇస్తే పరిస్థితేమిటి? అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. అయినప్పటికి తనకున్న లెక్కలతో అప్పలనాయుడుకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు.

తాజాగా ఎంపీగా ఎన్నికైన అప్పలనాయుడూ చంద్రబాబు వద్దకు వచ్చారు. ఎన్నికైన పార్టీ ఎంపీలంతా శుక్రవారం ఉదయానికి ఢిల్లీకి చేరుకోవాల్సి ఉన్న నేపథ్యంలో.. అప్పలనాయుడు ఢిల్లీ టికెట్ తీశారా? అంటూ చంద్రబాబు ప్రత్యేకంగా ఆరా తీయటం ఆసక్తికరంగా మారింది. పార్టీకి చెందిన నేతలతో.. వారికి సంబంధించిన చిన్న విషయాల్ని సైతం చంద్రబాబు ఎంత జాగ్రత్తగా గమనిస్తారన్న దానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా చెబుతున్నారు.

చంద్రబాబును కలిసి.. ఆయన ఆశీస్సులు తీసుకోవటానికి వచ్చిన అప్పలనాయుడ్ని అప్యాయంగా దగ్గరకు తీసుకున్న చంద్రబాబు.. ‘ఢిల్లీకి వెళ్లటానికి విమాన టికెట్ ఉందా? తీసుకున్నావా? లేకపోతే చెప్పు మనవాళ్లు టికెట్ బుక్ చేస్తారు?’’ అంటూ ప్రత్యేకంగా ఆరా తీయటంతో అక్కడే ఉన్న తెలుగు తమ్ముళ్లు పలువురు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అధినాయకుడిగా ఉంటూ.. తన వారి కష్టసుఖాల్ని గుర్తించే విషయంలో చంద్రబాబు ఎలా ఉంటారన్న దానికి ఇదో ఉదాహరణగా చెబుతున్నారు.

సామాన్య కార్యకర్తకు.. చిన్న నాయకులకు పార్టీలో పదవులు.. అవకాశాలు కల్పించేలా తన నిర్ణయాలు ఉంటాయని మాటలు చెప్పే చంద్రబాబు.. చేతల్లోనూ దాన్నే ఫాలో అవుతారన్న విషయం విజయనగరం ఎంపీ టికెట్ ఎంపికలో చూపించారు చంద్రబాబు. అంతేకాదు..పార్టీ కోసం కష్టపడే వారిలో ఆర్థికంగా బలహీనంగా ఉన్నా.. తాను ఆదుకోవటం చంద్రబాబు ప్రత్యేకతగా చెబుతున్నారు. ఆర్థిక అంశం టికెట్ సాధనకు అడ్డుగా ఉండకూడదన్నట్లుగా బాబు నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. దీనికి అప్పలనాయుడి ఉదంతమే ఒక ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు. గతంతో పోలిస్తే చంద్రబాబులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.

Tags:    

Similar News