అమరావతి, పోలవరం, జగన్ లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

అవును... తాజాగా అమరావతి నిర్మాణాలను పరిశీలించిన చంద్రబాబు.. అనంతరం సీఆర్డీయే కార్యాలయంలో మాట్లాడారు.

Update: 2024-06-20 11:17 GMT

తాజాగా నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. పోలవరాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టును చూస్తే బాదేసిందని ఆ సందర్భంగా బాబు తెలిపారు. ఈ క్రమలోనే తాజాగా అమరావతి నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా అమరావతి, పోలవరం, జగన్ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... తాజాగా అమరావతి నిర్మాణాలను పరిశీలించిన చంద్రబాబు.. అనంతరం సీఆర్డీయే కార్యాలయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా... కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని పూర్తవుతుందనే నమ్మకంతో అమరావతి రైతులు తమ పోరాటాన్ని విరమించారని.. ఈ సందర్భంగా ఆ రైతులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేశారు చంద్రబాబు.

ఈ సందర్భంగా ఏపీ అంటే... ఏ - అమరావతి, పీ - పోలవరం అని అన్నారు. ఈ సందర్భంగా... పోలవరం పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీరు వస్తుందనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పిన చంద్రబాబు... పోలవరం పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని అన్నారు.

ఈ నేపథ్యంలో... కేంద్ర నిధులతో పోలవరం కట్టి, ఇక్కడి నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటే సాగునీటి రంగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. అయితే తాజాగా పోలవరం సందర్శించాక చాలా బాధేస్తోందని చెప్పిన చంద్రబాబు... పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదారిలో కలిపేసిందని.. రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం శాపంగా మారిందని అన్నారు.

ఈ సందర్భంగా... అమరావతి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని చెప్పిన చంద్రబాబు... పవిత్ర జలాలు, మట్టి తీసుకొచ్చి ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం కాబట్టి ఆ మట్టే మనల్ని కాపాడిందని అన్నారు. నాడు తమ ప్రభుత్వం ఎక్కడ ఆపిందో ఆ బిల్డింగులు అలాగే ఉన్నాయని.. ఐకానిక్‌ కట్టడాలన్నీ నిలిచిపోయాయని.. పూర్తి కావాల్సిన ఎన్నో పనులు నిలిపివేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విధంగానే గత ఐదేళ్లు.. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని.. అయిదేళ్ల తర్వాత మీ రాజధాని ఏది అని అడిగితే చెప్పుకోలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని.. ఇలాంటి వ్యక్తులకు ఓటేసిన వారు ఈ సందర్భంగా ఆలోచించుకోవాలని.. చంద్రబాబు తెలిపారు. తెలుగుజాతి గర్వంగా తలెత్తుకునేలా రాజధాని నిర్మాణం ఉండాలని తెలిపారు.

ఈ సమయంలోనే... ప్రజావేదికను కూల్చి జగన్‌ పాలన ప్రారంభించారని చెప్పిన చంద్రబాబు... హిరోషిమా, నాగసాకిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజావేదికను జగన్‌ కూల్చేశారని.. ఆ విధ్వంసానికి గుర్తుగా దాన్ని అలాగే ఉంచుతామని తెలిపారు. గత సీఎంలు చేతనైతే అభివృద్ధి చేశారు.. లేకుంటే ఊరుకున్నారు కానీ... జగన్‌ లా మాత్రం చేయలేదంటూ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు!

Tags:    

Similar News