ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్న బాబు...మంత్రాంగమేనా...?
చంద్రబాబు కేసులు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కి బాబు హాజరు అవుతున్నారని అంటున్నారు.
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సడెన్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు. ఏపీ జనాలకు చంద్రబాబు ముఖం చూపించి మూడు నెలలు అయింది . ఇటీవలనే చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే దాన్ని సీఐడీ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.
ఆ విచారణ సంగతి అలా ఉంచితే చంద్రబాబు అయితే ప్రస్తుతానికి ఫ్రీ బర్డ్. ఆయన మీద ఎలాంటి ఆంక్షలు అయితే లేవు. దాంతో ఆయన మంచి ముహూర్తం చూసుకుని జనాల్లోకి రావాలని చూస్తున్నారు. ఈ లోగా ఆయన తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో తాను ఉన్న ఇంటి నుంచే వ్యూహరచన చేస్తూ బిజీగా ఉన్నారని కూడా ప్రచారం సాగింది.
తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ కి టీడీపీ ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తోంది అని అంతా అంటున్నారు. ఇక తెలంగాణా ఫలితాలు ఏపీని ప్రభావితం చేస్తాయని కూడా టాక్ ఉంది. దాంతో ఫుల్ ఫోకస్ అంతా తెలంగాణా ఎన్నికల మీద బాబు పెట్టారని అంటున్నారు.
ఈ డిసెంబర్ 3న తెలంగాణా సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. దాంతో తెలంగాణా సహా జాతీయ రాజకీయాలలో చోటు చేసుకునే పరిణామాలను అన్నీ చూసుకుని మరీ చంద్రబాబు తన ఏపీ రాజకీయానికి పదును పెడతారు అని అంటున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే సడెన్ గా చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు కేసులు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కి బాబు హాజరు అవుతున్నారని అంటున్నారు.
ఇక ఢిల్లీలో సిద్ధార్థ్ లూథ్రా తనయుడి వివాహం ఈ నెల 26న జరగనుంది. ఆ మరుసటి రోజున అంటే ఈ నెల 27న రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ పెళ్లి రిసెప్షన్ కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలియచేస్తున్నాయి. అయితే చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా ఈ వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారని తెలుస్తోంది.
ఇక ఢిలీలో చంద్రబాబు రెండు రోజుల పాటు ఉంటారని అంటున్నారు. మరి ఆయన రాజకీయ మంత్రాంగం ఏమైనా అక్కడ నుంచి నడుపుతారా అన్నది కూడా చర్చకు వస్తోంది. బాబు ఢిల్లీకి వెళ్ళి చాలా కాలం అయింది. దాంతో ఆయన తన అరెస్ట్ అజ్ఞాత వాసం తరువాత జాతీయ మీడియానే ముందు ఫేస్ చేస్తారా అన్నది కూడా చర్చకు వస్తోంది.
అలాగే బాబు ఢిల్లీలో రాజకీయ ప్రముఖులను కూడా కలుస్తారా అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు ఢిల్లీ టూర్ ఆసక్తిని రేపుతోంది. ఇక అన్నీ మాకు మంచి రోజులే అని టీడీపీ శ్రేణులు ధీమాగా ఉన్న వేళ బాబు హస్తిన ప్రయాణం మాత్రం ఆసక్తిని పెంచేస్తోంది.