తాజా అప్‌ డేట్స్‌.. చంద్రబాబు పిటిషన్లపై 3 కోర్టుల స్పందన ఇదే!

స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే

Update: 2023-09-27 10:44 GMT

స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఏసీబీ కోర్టులోనూ తన రిమాండ్‌ పై పిటిషన్లు వేశారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ ను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. ధర్మాసనంలో ఉన్న తన సహచర జడ్జి ఎస్‌వీ భట్టి ఈ పిటిషన్‌ ను విచారించడానికి సిద్ధంగా లేరని మరో జడ్జి ఖన్నా తెలిపారు. అయితే చంద్రబాబు తరఫున కేసు వాదిస్తున్న హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూద్రా ఈ పిటిషన్‌ ను వెంటనే విచారించాలని కోరారు. అయితే వచ్చే వారం చూద్దామని.. సహచర జడ్జి ఎస్‌వీ భట్‌.. ఈ పిటిషన్‌ పై విచారించడానికి 'నాట్‌ బిఫోర్‌ మి' అంటున్నారని జస్టిస్‌ ఖన్నా తెలిపారు.

ఈ నేపథ్యంలో సిద్థార్థ లూద్రా ఈ పిటిషన్‌ ను త్వరగా విచారించాలని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. అయితే ఆయనను మీరు కలవడానికి ఇబ్బంది లేదని.. తాను మాత్రం కేసును వాయిదా వేస్తున్నానని జస్టిస్‌ ఖన్నా స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ పై విచారణను వాయిదా వేశారు. సోమవారం అయినా వాదనలకు అవకాశం ఇవ్వాలని హరీశ్‌ సాల్వే కోరారు. అయితే సోమవారం కూడా అవకాశం లేదని.. వచ్చే వారం వింటామని జస్టిస్‌ ఖన్నా బదులిచ్చారు. ఈ పిటిషన్‌ ను విచారించడానికి నా సహచర జడ్జి భట్‌ సిద్ధంగా లేరు కాబట్టి మరో జడ్జితో విచారిస్తామని ఆయన తెలిపారు. మరోవైపు సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టులో అక్టోబర్‌ 2 తర్వాతే విచారణకు రానుంది.

ఇంకోవైపు హైకోర్టులో చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వొద్దని అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం కోరారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై వాదనలు సందర్భంగా ఆయన కోర్టుకు ఈ మేరకు విన్నవించారు. వేర్వేరు కేసుల్లో సెక్షన్‌ 428 వర్తించదన్నారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసుల్లో 2 వేర్వేరు లావాదేవీలు జరిగాయని కోర్టుకు నివేదించారు. ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబు కీలక సూత్రధారి, కీలక పాత్రధారి అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్‌ ఇవ్వవద్దని కోరారు.

మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్‌ పై విచారణ చేయాలని ఏసీబీ లాయర్‌ వివేకానంద కోరారు. మరికొద్ది రోజులు ఆయనను సీఐడీ కస్టడీకి ఇవ్వాలని కోరారు. తొలి విడతలో రెండు రోజుల విచారణలో చంద్రబాబు సహకరించలేదని.. కాబట్టి మరోమారు కస్టడీకి ఇవ్వాలని విన్నవించారు. ఈ కేసులో మధ్యాహ్నం తర్వాత వాదనలు వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కస్టడీ పిటిషన్‌ తోపాటు, చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ పై కూడా ఏసీబీ కోర్టు విచారించనుంది. మరోవైపు చంద్రబాబు బెయిల్‌ ను వ్యతిరేకిస్తూ సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఐదు రోజులపాటు ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోరింది.

మరోవైపు చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ ను విచారించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇందుకు బెంచ్‌ ను కేటాయించింది. అయితే ఈ పిల్‌ ను విచారించేందుకు తమలో ఒకరికి అభ్యంతరం ఉందని పేర్కొంది. న్యాయమూర్తి జస్టిస్‌ రఘనందన్‌ రావు 'నాట్‌ బిఫోర్‌ మి' అని పేర్కొన్నారని తెలిపింది.

Tags:    

Similar News