చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల... ఎస్పీఓ2: 97!
అవును... రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10 నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. స్పెషల్ కేస్ గా ట్రీట్ చేసిన న్యాయస్థానం ఇంటి నుంచే భోజనం, మందులు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆయన అస్వస్థతకు గురైన సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
అవును... రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా ఎండ ఎక్కువగా ఉండటం, ఉక్కపోత కారణంగా ఆయన స్కిన్ అలర్జీతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని చంద్రబాబు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన జైలు అధికారులు రాజమండ్రి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభకి సమాచారం ఇచ్చారు.
వెంటనే స్పందించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ ఇద్దరు చర్మ సంబంధిత వ్యాధి నిపుణులను కేటాయించారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.సూర్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్. సునీతాదేవి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేపట్టారు. అనంతరం... వైద్యులు పరీక్షలు చేసి మందులను సూచించారని, ఆ మందులను చంద్రబాబుకు అందిస్తామని డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ వెల్లడించారు.
ఇలా చంద్రబాబు చర్మ సంబంధిత వ్యాధి బారినపడిన నేపథ్యంలో హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. బీపీ, టెంపరేచర్ నార్మల్ గా ఉందని.. పల్స్ రేట్ నిమిషానికి 87 ఉందని, ఊపిరితిత్తుల్లో ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. ఇదే సమయంలో చంద్రబాబు ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
హెల్త్ బులిటెన్ వివరాల ప్రకారం...
బీపీ: 140/80
టెంపరేచర్: సాధారణం
పల్స్: 87
ఎస్పీఓ2: 97
హార్ట్: ఎస్1 ఎస్2
లంగ్స్: క్లియర్
ఫిజికల్ యాక్టివిటీ: గుడ్
కాగా... చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితమే డీహైడ్రేషన్ కు గురైనట్లు చెప్పినా.. ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు ఆరోగ్యం, రక్షణ విషయంలో నిత్యం అలర్ట్ గా ఉంటున్నామని జైలు అధికారులు చెబుతున్నారు! ఇదే సమయంలో రాజమండ్రిలో గతకొన్ని రోజులుగా ఎండతీవ్రత ఎక్కువగా ఉందని అంటున్నారు.