కమలం కబంధ హస్తాలలో బాబు...టీడీపీలో గగ్గోలు....!

చంద్రబాబు అపర చాణక్యం అంతా ఏమైంది అని ఇపుడు సొంత పార్టీలోనే అంటున్న మాట

Update: 2024-02-09 12:37 GMT

చంద్రబాబు అపర చాణక్యం అంతా ఏమైంది అని ఇపుడు సొంత పార్టీలోనే అంటున్న మాట. పోయి పోయి అర శాతం కూడా ఏపీలో ఓట్లు లేని బీజేపీ పొత్తు ఏమిటి అని నొసలు చిట్లించే తమ్ముళ్ళు కనిపిస్తున్నారు. బీజేపీతో పొత్తు వల్ల ఏ మాత్రం రాజకీయ లాభం లేకపోగా టీడీపీకి భారీ గండి పడుతుందని తమ్ముళ్ళు భయపడుతున్నారు.

సీట్ల రూపంలో తమ్ముళ్ళకు తొలి దెబ్బ పడితే ఓట్ల చిల్లు రూపంలో పోటీలో ఉన్న అభ్యర్ధులకు గట్టి దెబ్బ పడుతుంది అని అంటున్నారు. బీజేపీతో పొత్తుని ఒక సెక్షన్ కచ్చితంగా వ్యతిరేకిస్తుంది. అల మైనారిటీ వర్గాలలో పాటు కొన్ని వర్గాల ఓట్లు దూరం అవుతాయి.

మరో వైపు చూస్తే ఏపీకి బీజేపీ ఏ మేలూ చేయలేదన్న సత్యం జనాలకు తెలుసు. దాంతో వారు బీజేపీ మీద ఉన్న కోపంతో టీడీపీని ఓడిస్తారు అని భయపడుతున్నారు. ఇక బీజేపీతో పొత్తు కోసం ఆ పార్టీ రాలేదు, చంద్రబాబే ఢిల్లీ వెళ్లారు. బీజేపీ బెట్టు చేసి మరీ సీట్ల మీద పట్టు బడుతోంది.

బీజేపీ పెద్దలు ఇదే చాన్స్ అని బిగ్ నంబర్ లోనే సీట్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరిస్తే ఎన్నికల కంటే ముందే ఓటమిని అంగీకరించినట్లు అవుతుంది అని అంటున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు చిక్కులే వీడలేదు, ఆ సర్దుబాట్లు పెద్ద తిరుగుబాట్లకు దారి తీస్తున్నాయి. ఈలోగా బీజేపీకి పెద్ద ఎత్తున సీట్లు సమర్పించుకుంటే తమ్ముళ్లకు సీట్లు ఏవీ అన్న కంగారు కలవరంతో కూడిన ఆగ్రహం కూడా తమ్ముళ్లలో కట్టలు తెంచుకుంటోంది.

మరో వైపు చూస్తే బీజేపీతో ఎందుకు ఇంతలా పొత్తు కోసం టీడీపీ అధినేత వెంపర్లాడుతున్నారు అంటే ఎలక్ష్నీరింగ్ కోసం జగన్ ని కట్టడి చేయడం కోసం. మరి జగన్ విషయంలో బీజేపీ అలా ఉందా. అంటే చంద్రబాబు ఇలా అమిత్ షా తో మాట్లాడి వచ్చేశాక ఆ మరుసటి రోజే జగన్ ని పిలిపించుకుని మరీ నరేంద్ర మోడీ అమిత్ షాలు ఇద్దరూ గంటల తరబడి ఆయనతో మంతనాలు జరిపారు.

ఈ మంతనాలలో రాజకీయ అంశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో టీడీపీ పెద్దలలో అంతర్మధనం మొదలైంది అని అంటున్నారు. రేపటి రోజున తమతో పొత్తులో ఉన్నా ఇండైరెక్ట్ గా జగన్ కే సహకారం అందిస్తూ పోతే ఇక లాభమేంటి అన్నది వారికి పట్టుకున్న బాధ అంటున్నారు. అనుకున్నది కాకపోతే ఎందుకొచ్చిన పొత్తు అన్నది కూడా ఆవేదనగా ఉంది అంటున్నారు.

ఇక బీజేపీతో పొత్తుని మెజారిటీ టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. దాని వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని వారు మొత్తుకుంటున్నారు. బీజేపీ జగన్ తో గుడ్ రిలేషన్స్ కొనసాగిస్తున్నంతవరకూ టీడీపీ పొత్తు పండదు కూడా అంటున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

సరే అలాగే బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీ ఇపుడు డెసిషన్ తీసుకుంటే బీజేపీతో నాలుగేళ్ళుగా పొత్తులో ఉంటూ మిత్రుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది మరో ప్రశ్నగా ఉంది. అసలు వారూ వీరూ వద్దు టీడీపీ సింగిల్ గా పోటీ చేయాలన్న డిమాండ్ కూడా అంతకంతకు పెరుగుతోంది. అయితే బాబు తెలిసో తెలియకో పొత్తుల ట్రాప్ లో పడిపోయారు. ఆయన పవన్ తో తెంచుకోలేరు, బీజేపీతోనూ దూరం కాలేరు అంటున్నారు.

మొత్తం మీద చూస్తే అన్నీ త్యాగం చేసి పొత్తులకు టీడీపీ ముందుకు వస్తే ఈ గందరగోళం నుంచి పూర్తి ప్రయోజనాలు వైసీపీ పొందేలా ఏపీ పొలిటికల్ సీన్ తయారవుతోంది అన్నది తమ్ముళ్ల ఆందోళనగా ఉంది. మొత్తానికి 2014 ని రిపీట్ చేయాలనుకుటే 2024లో కుదరక పోగా కధ అడ్డం తిరుగుతుందా అన్న కంగారు అంతకంతకు టీడీపీలో పెరిగిపోతోంది.

Tags:    

Similar News