12న ప్రమాణం ...ఇక రాజకీయ పాలనే

ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు

Update: 2024-06-06 13:59 GMT

ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఆ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీతో పాటు అతిరధ మహారధులైన దేశ నాయకులు అంతా హాజరు అవుతారు అని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే చంద్రబాబు అధికారంలోకి ఎపుడు వచ్చినా చుట్టూ అధికారులు ఉంటారని పాలన అంతా వారి చుట్టూనే ఉంచి నడిపిస్తారు అని ఒక విమర్శ ఉంది. ఏకంగా పార్టీ నేతలు కూడా పలుమార్లు ఇదే విషయం ఆయనకు చెప్పారు కూడా. ఇప్పటికి ముమ్మారు సీఎం అయిన చంద్రబాబు ఎపుడూ కూడా పాలనలో అదే స్టైల్ మెయిన్ టెయిన్ చేశారు అని చెబుతారు

కానీ చంద్రబాబు తాను మారిపోయాను అని అంటున్నారు. అదెలా అంటే రాజకీయ పాలననే ఈసారి అంతా చూస్తారు అని అంటున్నారు. అధికారులతో కాదు పార్టీ ప్రజా ప్రతినిధులతొనే తాను కలసి ముందుకు సాగుతాను అని ఆయన అన్నారు. టీడీపీకి చెందిన 16 మంది లోక్ సభ ఎంపీలు గెలిచిన సందర్భంగా తాజాగా ఆయన నిర్వహించిన టీడీపీ కీలక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక మీదట బ్యూరోక్రసీ పాలనకు చెల్లు చీటీ అని ఆయన అనేశారు. అదే సమయంలో తాను పార్టీకి నాయకులకు ప్రజా ప్రతినిధులకూ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాను అని అన్నారు. తనను ఎపుడైనా పార్టీ వారు వచ్చి కలవవచ్చు అని ఆయన చెప్పేశారు.

తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ పార్టీ వారితో మాట్లాడుతాను అని అన్నారు. తన కోసం పార్టీ నాయకులు క్యాడర్ ప్రాణాలకు తెగించి పోరాడారని ఈ సందర్భంగా బాబు అన్నారు. మెడ మీద కత్తి పెట్టి ప్రత్యర్ధులు బెదిరించినా జై బాబు జై తెలుగుదేశం అని మాత్రమే అన్నారంటే వారి ప్రేమకు తాను ఎంతకైనా రుణగ్రస్తుడిని అని బాబు ఎమోషనల్ అయ్యారు.

అయిదేళ్ళ వైసీపీ పాలలలో ఎన్ని ఒత్తిడులు పెట్టినా ఎవరూ తలొగ్గలేదని ఆయన అంటూ అదే తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని అన్నారు. అందువల్ల తాను పూర్తిగా మారాను అని బాబు పదే పదే చెప్పారు. ఇక మీదట ప్రతీ అంశాన్ని తాను వింటాను తానే చూస్తాను అని ఆయన హామీ ఇచ్చారు.

పార్టీకి ప్రజలు అద్భుతమైన విజయం కట్టబెట్టారు అని ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కలసి రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాలని ఆయన కోరారు. ఢిల్లీలో ఎంపీలు కూడా రాష్ట్ర శ్రేయస్సునే దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని ఆయన సూచించారు.

ఈ విజయం పార్టీ శ్రేణులు నేతల కష్టం అని ఆయన అన్నారు. వారు చేసిన త్యాగాన్ని తాను ఎపుడూ గుర్తుంచుకుంటాను అని పార్టీ నాయకులు గెలిచిన ప్రజా ప్రతినిధులు కూడా అలాగే వ్యవహరించాలని చంద్రబాబు కోరారు.

Tags:    

Similar News