చేసుకున్నోడికి చేసుకున్నంత...ఎంపీ అభ్యర్థుల కోసం బాబు పక్కచూపులు!
రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ తరుపున పోటీచేయడానికి ఎంపీ అభ్యర్థుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారబోతోందా
రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ తరుపున పోటీచేయడానికి ఎంపీ అభ్యర్థుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారబోతోందా.. ఆ పార్టీ తరుపున ఎంపీ అభ్యర్థిగా పోటీచేయడానికి నాయకులు వెనకడుగు వేస్తున్నారా.. ఎల్లో మీడియాలో జాకీలు వేసి లేపినా, ఆహా ఓహో అంటూ ప్రచారం చేసినా ప్రయోజనం కనిపించడం లేదా.. టీడీపీకి ఉన్న ముగ్గురు సిట్టింగ్ ఎంపీలూ తలోదారిలో ఉన్నారా అనే ప్రశ్నలన్నింటికీ అవుననే సమాదానం తెరపైకి వస్తోంది.
అవును... పైకి ఎంత హడావిడి చేస్తున్నా 2019 ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఎంపీలు సైతం రాబోయే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసే పరిస్థితి సైతం లేదనే చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైంది. దీనికి గల కారణాలు సైతం ఆసక్తిగా మారాయి. పెట్టుబడి కూడా పెరగడం ప్రధాన కారణమా అనే కామెంట్లూ ఆఫ్ ద రికార్డ్ వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో తమ తరుపున పోటీచేసే అభ్యర్థుల కోసం టీడీపీ జూం వేసి మరీ వెతుకుతుందని అంటున్నారు.
ప్రస్తుతం టీడీపీ ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వారిలో ప్రధానంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీకి, పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఆయన కుమార్తె కేశినేని శ్వేత... పార్టీ వ్యవహారశైలిపై వాయించి వదిలారు! ఇక గుంటూరు ఎంపీగా ఉన్న జయదేవ్ చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈసారి పోటీ చేయలేనని తేల్చి చెప్పారు! మరోవైపు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం ఈసారి లోక్ సభకు పోటీ చేయాలనే ఆలోచనను ఆల్ మోస్ట్ విరమించుకున్నారని అంటున్నారు.
ఇలా సిట్టింగులు, పైగా రెండేసి సార్లు గెలిచిన ఎంపీలు సైతం ఈ దఫా పోటీపై ఆసక్తి చూపకపోవడంతో.. వీరి అనుభవాలను పరిగణలోకి తీసుకున్నారో ఏమో కానీ... కొత్తవారు సైతం పోటీకి ఆసక్తి చూపడం లేదట! దీంతో 25 జిల్లాలకు ఎంపీ అభ్యర్థులను వెతకడం ఇప్పుడు టీడీపీ అధిష్టాణానికి తలకు మించిన భారం కాబోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక మిగిలిన లోక్ సభ నియోజకవర్గాలలో కూడా పోటీ చేసేందుకు నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే.. ఎంపీగా పోటీ చేసే వారికి చంద్రబాబు పెడుతున్న టార్గెట్లు కూడా "భారీ" గా ఉండటంతో పోటీకి దూరంగా ఉండటానికే ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. రాయలసీమలో తిరుపతి స్థానం నుంచి పోటీలో ఉండే సినీనటుడు శివప్రసాద్ మరణంతో అక్కడ పార్టీకి సరైన అభ్యర్థి ఇప్పటికీ దొరకడం లేదని తెలుస్తుంది.
ఇదే సమయంలో... చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు ఎంపీ స్థానానికి కూడా అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి ఉందనే చర్చ స్థానికంగా మొదలైంది. ఇక కర్నూలు నుంచి గత ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేయగా.. గత ఎన్నికల్లో 1,48,889 ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం గుర్తుకు తెచ్చుకునో ఏమో కానీ... ఈసారి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తుంది.
ఇక నరసరావుపేట నుంచి పోటీ చేసిన రాయపాటి... కన్నా లక్ష్మీనారాయణ ఎంట్రీతో పార్టీకే దూరంగా ఉంటున్న పరిస్థితి అంటున్నారు! ఇక బాపట్లలో పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరాం పరిస్థితి కూడా అంతే అనే మాటలు వినిపిస్తున్నాయి. కడపలోనూ పోటీ చేసే అభ్యర్థి దొరకడం లేదని.. గతంలో వైసీపీకి వచ్చిన మెజారిటీలు టీడీపీ అభ్యర్థులకు కనీసం పోటీచేసే ఆలోచన కూడా రాకుండా చేస్తున్నాయని చెబుతున్నారు.
ఇలా దాదాపు 25 లోక్ సభ నియోజకవర్గాల్లో సగానికిపైగా స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదని.. "లెక్క"పెరగడంతో రిస్క్ చేయలేమని ఫేస్ టు ఫేస్ చెబుతున్నారని తెలుస్తుంది! దీంతో పక్క పార్టీల్లో ఉన్న నాయకులు ఎవరైనా తమ పార్టీలోకి వస్తారేమోనన్న ఆశతో చంద్రబాబు పక్కచూపులు చూస్తున్నారనే చర్చ కూడా మొదలైంది. మరి ఆ స్థానాలను బాబు ఎలా భర్తీ చేస్తారనేది వేచి చూడాలి!