ఏపీలో కొత్త సీన్.. బాబుతో టచ్ కోసం తహతహ?
విపక్ష నేతతో పోలిస్తే అధికారపక్ష అధినేత నోటి నుంచి గెలుపు మాట బలంగా వినిపించటం తెలిసిందే
ఏపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార.. విపక్షాలకు అత్యంత కీలకమైన ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ పూర్తి కావటం.. తదనంతర పరిణామాల గురించి తెలిసిందే. గెలుపు ధీమాను అధికార.. విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. విపక్ష నేతతో పోలిస్తే అధికారపక్ష అధినేత నోటి నుంచి గెలుపు మాట బలంగా వినిపించటం తెలిసిందే. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ విదేశీ పర్యటనలో ఉండటం తెలిసిందే.
పోలింగ్ ముగిసిన తర్వాత ఏపీలోని పలు జిల్లాల్లో హింసాత్మక పరిణామాలు చోటు చేసుకోవటం.. ఈ సందర్భంగా వాటిని కట్టడి చేయటంలో పోలీసు అధికారులు ఫెయిల్ కావటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఈ అంశంపై సీరియస్ కావటం.. చర్యలు తీసుకోవటం.. సిట్ ను ఏర్పాటు చేయటం లాంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి.ఇదంతా ఓవైపు కాగా.. మరోవైపు ఎన్నికల పోలింగ్ మీద విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. పోలింగ్ జరిగిన తీరు.. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడి ఉంటాయన్న దానిపై అధికార.. విపక్ష వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి.
గెలుపుపై ఎవరి ధీమా వారిదే అయినప్పటికీ అధికారుల తీరులో కొత్త మార్పు రెండు రోజులుగా మొదలైనట్లుగా చెబుతున్నారు. అత్యంత కీలక స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు విపక్ష నేత చంద్రబాబు టచ్ కోసం తహతహలాడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజల నాడిని అంచనా వేసిన సదరు అధికారులు.. అధికారంలోకి టీడీపీ వచ్చే వీలుందన్న అంశాన్ని నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది.
టీడీపీకి ప్రస్తుతానికి టచ్ లోకి వెళ్లిన అధికారుల్లో ఎక్కువ మంది గత ప్రభుత్వంలో పక్కన పెట్టేసిన వారే కాదు.. ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న వారు కూడా ఉండటం గమనార్హం. తమపై టీడీపీ ముద్ర వేసి పక్కకు పెట్టారని.. తమ సంగతిని చూడాలన్న సందేశాల్ని పంపుతున్నారు. ప్రభుత్వ విధానాలకు తగ్గట్లుగా తాము నడుచుకుంటామని.. తమకు కీలక పోస్టింగులు ఇవ్వాలన్న అంశాన్ని తెస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇదే తరహా సందేశాన్ని జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు సైతం కొందరు ఉండటం గమనార్హం.
తాము రిటైర్మెంట్ కు దగ్గర్లో ఉన్నాని.. చివర్లో అయినా కీలకమైన పదవి నుంచి రిటైర్ అయితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. తాను టీడీపీకి.. చంద్రబాబుకు వ్యతిరేకం కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకోవటం ఆసక్తికరంగా మారింది. తమను టీడీపీ వ్యతిరేకుల జాబితాలో చేర్చవద్దన్న విషయాన్ని కొందరు నేతల ద్వారా అధినేతకు రాయబారాలు చేస్తున్న వైనం ఇప్పుడు ఎక్కువైంది.
కొందరు అధికారులు ఓట్ల లెక్కింపునకు ముందుగానే ప్రయత్నాలు చేసుకోవటం ద్వారా.. తమకు అధిక ప్రాధాన్యం లభిస్తుందన్న భావనలో ఉన్నట్లుగా చెప్పాలి. కొందరు అధికారులు బీజేపీకి చెందిన ముఖ్యనేతలతో ఫోన్లు చేయించటం ఇప్పుడో కొత్త పరిణామంగా చెప్పాలి. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అధికారుల్ని ఎప్పుడూ టార్గెట్ చేయలేదని.. కానీ గడిచిన ఐదేళ్ల అనుభవ పాఠాలతో మాత్రం ఈసారి భిన్నంగా వ్యవహరించాలన్న ఆలోచనతో ఉండటం తెలిసిందే.
ఇప్పటికే లోకేశ్ రెడ్ బుక్ పేరుతో తమను ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లను రాయటం.. ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పటం తెలిసిందే. తమకు టచ్ లోకి వస్తున్న అధికారులకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా గుంభనంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. 2019లో తమకు లభించిన సీట్ల కంటే ఎక్కువ సీట్లతో విజయాన్ని సాధిస్తామని సీఎం జగన్ చెబుతుంటే.. అందుకు భిన్నంగా అధికారుల లోగుట్టు లాబీయింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై మరింత ఉత్కంట పెంచేలా చేస్తుందని చెప్పాలి.