పోలవరం పెరిగిన ఖర్చు భరించేది ఎవరు ?

మరి ఇది భారీ మొత్తంగానే చూడాలి. పోలవరం విషయంలో కేంద్రం అయితే 2014 లెక్కల దగ్గరే ఆగిపోయింది

Update: 2024-06-29 03:15 GMT

పోలవరం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. అందులో పేర్కొన్న అంశాల ప్రకారం చూస్తే పోలవరం ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది అనే చెప్పాలి. ఏకంగా ప్రస్తుతం అంచనా వ్యయం మీద 36 శాతం పెరిగింది అని అంటున్నారు. అంటే మూడవ వంతు అన్న మాట.

మరి ఇది భారీ మొత్తంగానే చూడాలి. పోలవరం విషయంలో కేంద్రం అయితే 2014 లెక్కల దగ్గరే ఆగిపోయింది. ఇప్పటికి 15 వేల కోట్ల రూపాయల పై చిలుకు మొత్తాన్ని ఇచ్చిన కేంద్రం తాము ఇవ్వాల్సింది అయితే పెద్దగా లేదని చెబుతోంది. పోలవరం జాతీయ ప్రాజెక్ట్. మొత్తానికి మొత్తం ఖర్చు కేంద్రం భరించాల్సి ఉంది.

అందుకో పునరావాసం ప్యాకేజ్ అతి పెద్దది. పోలవరం ప్రాజెక్ట్ లో దీని వాటావే సిం హ భాగంగా ఉంటుంది. మరి ఈ రెండింటినీ విడదీసి చూడడం అన్నది కుదరదు. ప్రాజెక్ట్ పూర్తి కావడం అంటే ఇదే. ఈ నేపథ్యంలో పునరావస ప్యాకేజ్ తో కలుపుకుని సవరించిన అంచనాలు చూసుకుంటే కనుక 56 వేల కోట్ల రూపాయల దాకా ఉంటాయి.

ఇపుడు చంద్రబాబు రిలీజ్ చేసిన శ్వేతపత్రం ప్రకారం చూస్తే మరో 36 శాతం ఖర్చు అదనంగా పడుతుందని అంటున్నారు అంటే మరో 18 వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్ట్ కి ఖర్చు అవుతుందని అంటున్నారు. అంటే 76 వేల కోట్ల రూపాయలకు అంచనాలు సవరించాలి అన్న మాట.

కేంద్రం చూస్తే గత పదేళ్లుగా ఇచ్చినది మొత్తంగా 15 వేల కోట్ల రూపాయలను మించినది లేదని అంటున్నారు. అంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలీ అంటే మరో అరవై వేల కోట్ల రూపాయలను కేంద్రం ఉదారంగా ఇవ్వాలి. అంతే కాదు ఒక నిర్దిష్ట కాలపరిమితితో ఇవ్వాలి. లేకపోతే ఆ ఖర్చు రెట్టింపు అవుతుంది. అంతే కాదు పోలవరం మరమ్మతుల విషయం కూడా శ్వేతపత్రంలో పేర్కొన్నారు.

డయాఫ్రం వాల్ ని ఆనుకుని సమాంతరంగా మరో వాల్ కట్టాల్సి ఉంది అని అంటున్నారు. డయాఫ్రం వాల్ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కట్టారు. అప్పట్లో అది నాలుగు వందల కోట్లతో నిర్మించారు. ఇపుడు పారలల్ గా వాల్ కట్టడానికి ఏకంగా 900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ మొత్తం ఎవరు భరించాలి అన్నది కూడా చర్చగా ఉంది. పోలవరం మరమ్మత్తులకు జాప్యానికి కేంద్రం ఎంతవరకూ బాధ్యత వహిస్తుంది అన్న చర్చ ఉంది. కేంద్రం ముందే చెప్పుకున్నట్లుగా ఒక డేట్ కి లాక్ అయి ఖర్చులు ఆనాటి లెక్కల వరకే పెడతామని అంటోంది. ఇక పారలల్ గా డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి కావడానికి రెండు సీజన్లు పడుతుందని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. అప్పటి దాకా మిగిలిన పనులు కూడా పూర్తి చేయడానికి లేదు.

మొత్తం మీద చూస్తే పోలవరం ఈ టెర్మ్ లో పూర్తి అవుతుందా అన్న చర్చ కూడా మొదలైంది. చంద్రబాబు సీఎం అయ్యాక తొలిసారి పోలవరం సందర్శించిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి నాలుగేళ్ళకు పైగా పడుతుందని నిపుణులు అంటున్నారని చెప్పారు. అంటే దానికి అదనంగా మరో ఏడాది రెండేళ్ళు వేసుకోవాల్సిందే అని అంటున్నారు.

ఇక డయాఫ్రం వాల్ విషయంలో చర్యలు ఏమి తీసుకోవాలి అన్న దాని మీద చర్చించేందుకు అంతర్జాతీయ నిపుణులు ఏపీకి తొందరలో వస్తారని అంటున్నారు.వారు వచ్చాక ఎలా ముందుకు సాగాలి అన్నది తెలుస్తుంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే పోలవరం మీద అధికార టీడీపీ విపక్ష వైసీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

పోలవరానికి జగన్ శాపం అని బాబు వ్యాఖ్యానించారు. జగన్ అనాలోచిత విధానాల వల్లనే పోలవరం సర్వనాశనం అయింది అని ఆయన విమర్శించారు. డయాఫ్రం వాల్ పోయింది అన్నది కూడా జగన్ కి రెండేళ్ళకు కానీ తెలియలేదు అంటే వారికి ప్రాజెక్ట్ మీద ఎంతటి శ్రద్ధ ఉందో అర్ధం అవుతుందని బాబు అన్నారు. పోలవరం కోసం తమ ప్రభుత్వం అయిదేళ్ల లో 11 వేల కోట్ల దాకా ఖర్చు పెడితే జగన్ ప్రభుత్వం నాలుగు వేల కోట్లు మాత్రమే పెట్టిందని బాబు వివరించారు.

దీని మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఘాటైన కౌంటర్ ఇచ్చారు. బాబు వల్లనే పోలవరం ప్రాజెక్ట్ దెబ్బ తింది అని ఆయన అంటున్నారు. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ పూర్తి కాకుండా నదీ ప్రవాహం మళ్లింపు కాకుండా కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ ఎందుకు నిర్మించారని ఆయన చంద్రబాబుని సూటిగా ప్రశ్నించారు.

వీటికంటే ముందు అసలు కేంద్రం పూర్తి చేయాల్సిన జాతీయ ప్రాజెక్టును ఎందుకు తీసుకున్నారని చంద్రబాబును అంబటి ప్రశ్నించారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని అప్పట్లో మోడీ చేసిన విమర్శల్ని కూడా ఆయన మరోసారి గుర్తుచేశారు.

వీటితో తోడు అంబటి రాంబాబు మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చేసారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే ఉద్దేశ్యం బాబుకు లేదని జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తారని అన్నారు. అంటే దీని అర్ధం ఇప్పట్లో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాదు అన్నది అంబటి వాదన. అధికార పార్టీ కూడా పోలవరం సర్వనాశనం అయింది అంటోంది. కేంద్రం అయితే ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. మొత్తానికి పోలవరాన్ని ఈ తరం చూస్తుందా అన్నదే బిగ్ క్వశ్వన్ గా ఉంది.

Tags:    

Similar News