చంద్రబాబు సంచలన నిర్ణయం...వారంతా హ్యాపీయేనా ?
ఆ మేరకు ఇపుడు టీడీపీ కూటమి సర్కార్ ముందుకు కదులుతోంది. తాజాగా గృహ నిర్మాణ శాఖ మీద సమీక్ష చేపట్టిన చంద్రబాబు పేదలకు శుభవార్త వినిపించారు.
ఏపీలో ఇళ్ళ నిర్మాణం విషయంలో ప్రభుత్వాలు ఇచ్చే హామీలు పాలనలో అయితే కనిపించడం లేదని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చామని చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం అందులో ఎన్ని ఇళ్ళు నిర్మించింది అన్నది ఆలోచించాల్సిందే. పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన చోట మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శలు ఉన్నాయి.
చూస్తూండంగానే పుణ్య కాలం గడచిపోయి వైసీపీ గద్దె దిగింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అర్బన్ లో సెంటున్నర భూమి రూరల్ లో సెంట్ భూమి ని ఇళ్ళ పట్టాలుగా ఇస్తే దానిని టీడీపీ విమర్శించింది. తాము అధికారంలోకి వస్తే మూడు సెంట్ల స్థలాన్ని ప్రతీ పేద కుటుంబానికీ ఇస్తామని చెప్పింది.
ఆ మేరకు ఇపుడు టీడీపీ కూటమి సర్కార్ ముందుకు కదులుతోంది. తాజాగా గృహ నిర్మాణ శాఖ మీద సమీక్ష చేపట్టిన చంద్రబాబు పేదలకు శుభవార్త వినిపించారు. ఇక మీదట కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో అయితే రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిది. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే అవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించింది.
అంతే కాదు హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు తరహాల్లో కేంద్ర పథకాల ఆసరాతో మధ్యతరగతి, దిగువ మద్య తరగతి వర్గాలకు మరియు జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్లను నిర్మించాలని కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తోంది. రానున్న వంద రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యాన్ని నిర్థేశించడం జరిగిందని ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు తెలిపారు. అందుకు తగ్గట్టుగా త్వరలోనే సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు.
అదే విధంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ.4.00 లక్షల యూనిట్ కాస్ట్ తో ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నుండి మంజూరు చేయడం జరుగుతుందని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారిని గుర్తించి లబ్దిచేకూర్చేందుకు త్వరలోనే సర్వే కూడా చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
మొత్తానికి చూస్తే పేదలకు ఇది శుభవార్తగానే ఉంది. అయితే వైసీపీ ఇచ్చిన 31 లక్షల పట్టాలు తీసుకున్న వారికి మాత్రం ఇపుడు కొత్తగా న్యాయం జరిగేది లేదని అంటున్నారు. కూటమి ప్రభుత్వం కొత్తగా లబ్దిదారులను ఎంపిక చేసి వారికి మాత్రమే మూడు సెంట్ల స్థలం ఇస్తుందని అంటున్నారు.
అయితే వైసీపీ ప్రభుత్వం భూ సేకరణ జరిపి పట్టాలు ఇవ్వకుండా లే అవుట్లు వేయకుండా వదిలేసిన చోట్ల మాత్రం మూడు సెంట్ల స్థలాన్ని ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. ఒక విధంగా చంద్రబాబు ప్రకటించిన ఈ నిర్ణయాలు కొత్త లబ్దిదారులకు ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు. మరి కేవలం సెంటు జాగా మాత్రమే గత ప్రభుత్వంలో దక్కించుకున్న లబ్దిదారులు ఇదంతా చూస్తూ ఊరుకుంటారా లేక తమకు కూడా న్యాయం చేయమని కోరుతారా అన్నది చూడాల్సి ఉంది.