అక్కడి నుంచే నరుక్కొస్తున్న చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో తమపై తప్పుడు కేసులు పెట్టి వేధించిన అధికారులపై, నేతలపై చర్యలు ఉంటాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు హెచ్చరించారు.
ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో నంబర్ టూగా వెలుగొందారు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంతేకాకుండా రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో పెద్దిరెడ్డి సూచించినవారికే జగన్ అసెంబ్లీ టికెట్లు ఇచ్చారు. ఇక పెద్దిరెడ్డి సొంత జిల్లా చిత్తూరు గురించి అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. ఎంపీ అభ్యర్థుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల దాకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే చక్రం తిప్పారు.
అంతటితో పెద్దిరెడ్డి ఆగలేదు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఆయనను ఓడించడానికి పెద్దిరెడ్డి చాలా ప్రయత్నాలే చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుప్పం పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైసీపీనే 90 శాతంపైగా స్థానాలను గెలుచుకునేలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలు పన్ని విజయం సాధించారు. కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలప్పుడు కూడా అక్కడే పెద్దిరెడ్డి మకాం వేసి మరీ వైసీపీని గెలిపించారు. ఈసారి చంద్రబాబును కుప్పంలో చిత్తుగా ఓడిస్తానని ఎన్నికల ముందు పెద్దిరెడ్డి భారీ సవాళ్లే విసిరారు.
అయితే అంతన్నాడు.. ఇంతన్నాడే గంగరాజు.. నట్టేట మునిగిపోయాడే గంగరాజు అన్నట్టు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే బొటాబొటీ మెజారిటీతో పుంగనూరులో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 52 స్థానాలున్న రాయలసీమలో వైసీపీ కేవలం 9 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
ఈ నేపథ్యంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని విధాల ఇబ్బందులు పెట్టడంతోపాటు పుంగనూరు నియోజకవర్గం అంగళ్లు వద్ద తనపై రాళ్ల దాడి చేయించి, హత్యాయత్నం కేసు నమోదు చేయించిన పెద్దిరెడ్డిపై చంద్రబాబు తన గేమ్ స్టార్ట్ చేశారని అంటున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు.. పెద్దిరెడ్డికి ఘాటు హెచ్చరికలు చేశారు. తాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను తలుచుకుని ఉంటే పెద్దిరెడ్డి ఇంటి నుంచి బయటకు కూడా వచ్చేవాడు కాదన్నారు. ఇప్పుడు అధికారంలో చంద్రబాబు ఉండటంతో పెద్దిరెడ్డిపై ముప్పేట దాడి మొదలైందని టాక్ నడుస్తోంది.
ఇటీవల ఎన్నికల్లో గెలిచాక పెద్దిరెడ్డి పుంగనూరుకు రావడానికి ఏర్పాట్లు చేసుకోగా టీడీపీ శ్రేణులు ఆ పట్టణంలో భారీ ఎత్తున నిరసనకు దిగాయి. పెద్దిరెడ్డి పుంగనూరుకు వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాయి. దీంతో పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో పర్యటించడానికి కూడా వీల్లేకుండా పోయింది. ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఇప్పుడు ఇక ఏకంగా ఏనుగు కుంభస్థలం మీదే కొట్టినట్టు పుంగనూరు మున్సిపాలిటీ చైర్మన్ సహా 12 మంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు పుంగనూరు టీడీపీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డిని కలిసి టీడీపీలో చేరడానికి ఆసక్తిని చూపారు. దీంతో పెద్దిరెడ్డికి తన సొంత నియోజకవర్గంలోనే బిగ్ షాక్ తగిలింది.
దీన్నిబట్టి రానున్న రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి చిక్కులు తప్పేలా లేవని అంటున్నారు.
వాస్తవానికి ఇందులో పెద్దిరెడ్డి తప్పే ఉందని అంటున్నారు. గతంలో చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో పర్యటించడానికి వస్తే ఆయనను అడుగడుగునా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దాడులు కూడా చేశారు. పోలీసులు సైతం వైసీపీ వారికే వంతపాడారనే విమర్శలు ఉన్నాయి. పైగా కుప్పంకు చెందిన పలువురు టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఇందులో చంద్రబాబు పీఏ కూడా ఉన్నారు. వీటన్నింటికి వెనుకా ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డేనని టీడీపీ శ్రేణులు అప్పట్లో ఆరోపించాయి. ఇలా తనను అన్ని రకాలుగా ఇబ్బందిపెట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు చంద్రబాబు షాకుల మీద షాకులు ఇస్తున్నారని టాక్ నడుస్తోంది.