బాబు ఫోన్ చేసిన వేళ.. జగన్ తప్పు చేశారా?

ప్రాణాలు తీసుకునే యుద్ధానికి సైతం ధర్మం.. మర్యాదలు ఉంటాయి. అలాంటిది రాజనీతిలోనూ కొన్ని నిబంధనలు ఉంటాయి

Update: 2024-06-12 04:14 GMT

ప్రాణాలు తీసుకునే యుద్ధానికి సైతం ధర్మం.. మర్యాదలు ఉంటాయి. అలాంటిది రాజనీతిలోనూ కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని ప్రత్యర్థి తెలివిగా వాడుతున్న వేళ.. అంతే తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి తీరును వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిస్ అవుతున్నారా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఎవరైనా కావొచ్చు. ఎంతటి శక్తివంతుడైనా అవ్వొచ్చు. రాజరికంలో కానీ ప్రజాస్వామ్యంలో కానీ అధికారం అన్నది ఎవరి చేతుల్లోనూ శాశ్వితంగా ఉండదు. ఒకసారి అధికారం చేజారినప్పుడు దాన్ని తిరిగి పొందేందుకు ఏం చేయాలో అది చేయాలి. దీనికి కారణం.. తనను నమ్ముకున్నోళ్ల కోసం ఆ మాత్రం చేయాల్సిన అవసరం ఉంటుంది.

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు మంగళవారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. అయితే.. చంద్రబాబు ఫోన్ కు జగన్ అందుబాటులోకి రాలేదు. కాబోయే ముఖ్యమంత్రి హోదాలో మరో పార్టీ అధినేతకు ఫోన్ చేసినప్పుడు అందుబాటులోకి రాకపోవటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్న. రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు. కానీ.. మర్యాదపూర్వకంగా ఫోన్ చేసినప్పుడు మాట్లాడటం తప్పు లేదు. ఆ మాటకు వస్తే.. మాట్లాడటం ద్వారా.. కొన్ని సంప్రదాయాల్ని పాటించటం ద్వారా విద్వేష రాజకీయాలకు చెక్ పెట్టే వీలుంది.

ప్రత్యర్థిని శత్రువుగా చూడటం తెలుగు రాజకీయాల్లో మొదలైన ఒక దరిద్రపుగొట్టు సంప్రదాయంగా చెప్పాలి. రాజకీయాల్లో పగ.. ప్రతీకారం ఏ మాత్రం మంచిది కాదు. అది మాత్రమే అధికారాన్ని కట్టబెడుతుందన్న ఆలోచన తప్పు అవుతుంది. ఎవరు రాజకీయం చేసినా.. ప్రజలకు మేలు చేయాలని.. వారి జీవితాల్ని బాగు చేయాలన్నదే లక్ష్యంగా చెబుతారు. అలాంటప్పుడు ఆ పని చేసే వారికి తమ వంతు సహకారం ఉంటుందన్న సంకేతాల్ని ఇవ్వాల్సిన అవసరం విపక్ష నేతగా జగన్ మీదా ఉంటుంది.

అధికార బదిలీ వేళలో కొన్ని ఉద్రిక్తతలు.. హింసాత్మక పరిణామాలు చోటు చేసుకోవటం మొదట్నించి ఉంటున్నదే. అది అన్ని సందర్భాల్లోనూ జరిగేదే. నిజానికి అలాంటి హింసాత్మక చర్యలకు చెక్ చెప్పేందుకు వీలుగా అధినేతలు తమ వ్యవహరశైలితో మార్పునకు శ్రీకారం చుట్టొచ్చు. కాబోయే ముఖ్యమంత్రి ఫోన్ చేసిన వేళలో కుదరలేకపోవచ్చు. ఆ తర్వాత మాట్లాడే ప్రయత్నం చేయటం ద్వారా సానుకూల సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుంది కదా? అలాంటిదేమీ చేయకుండా ఉండటం ద్వారా జగన్ ఏం ఆశిస్తున్నట్లు?

రాజకీయాల్లో పోరు కావొచ్చు.. రాజకీయం కావొచ్చు.. ఎన్నికలకు పరిమితం చేయటం రాష్ట్ర ప్రజలకు మంచిదన్న విషయాన్ని జగన్ ఎందుకు మిస్ అవుతున్నట్లు? విద్వేష రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఏపీ మారిందన్న చెడ్డ పేరు తన తీరుతో వేలెత్తి చూపే అవకాశాన్ని ఆయన ఎందుకు ఇస్తున్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది.

Tags:    

Similar News