చంద్రబాబు ఆవేశం మంచిదేనా...!
తాజాగా కోనసీమలో నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడిన చంద్రబాబు.. జగన్‌ను టార్గెట్ చేసుకున్నారు. ఇది సహజమే.
ఎన్నికలకు ముందు ఎలాంటి కామెంట్లయినా చేయొచ్చు.. అది రాజకీయం. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అది కూడా అప్రతిహత విజయం దక్కించుకున్నారు. మరి అలాంటప్పుడు.. కూడా ఫక్తు రాజకీ య కామెంట్లు అవసరమా? అనేది ఇప్పుడు చంద్రబాబు ప్రసంగం విన్నవారికి అనిపిస్తున్న భావన. పైగా వివాదాస్పదంగా కూడా ఉండడం గమనార్హం. ఇప్పటికే.. తమపై దాడులు చేస్తున్నారని.. తమ నాయకు లను హత్య చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడుతున్నారు.
ఇలాంటి సమయంలో చంద్రబాబు ఆచి తూచి మాట్లాడాలి. వైసీపీ ప్రస్తావన లేకుండా.. ఉన్నా వివాదం కాకుండా కూడా ఆయన వ్యవహరించాలి. కానీ, ఎందుకో.. చంద్రబాబు ఆవేశ పడుతున్నారు. ఆయన మనసులో ఏముందో ఏమో తెలియదు కానీ.. మాటలు తూలుతున్నారు. తాజాగా కోనసీమలో నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడిన చంద్రబాబు.. జగన్‌ను టార్గెట్ చేసుకున్నారు. ఇది సహజమే. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు.. కాబట్టి అంతా మేమే చేస్తున్నామని చెప్పుకోవడం.. ప్రభుత్వాలకు కామన్.
ఇంత వరకు చంద్రబాబు ఆగిపోయి ఉంటే బాగుండేది. కానీ, ఇదే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. ''వైసీపీని మీరు(ప్రజలు) తరిమి కొట్టారు. 11 స్థానాలకే పరిమితం చేశారు. అయినా బుద్ధి రాలేదు. జగన్ భూతం ఇంకా వేలాడుతోంది. దీనిని భూస్థాపితం చేయాలి'' అని చంద్రబాబు అన్నా రు. ఈ వ్యాఖ్యలే వివాదానికి దారి తీశాయి. 'భూస్థాపితం' అంటే.. తమ నాయకుడిని చంపేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారంటూ.. వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల సమయంలోనూ ఇలానే చంద్రబాబు వ్యాఖ్యానిం చారు. అయితే.. అప్పట్లో పరిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆయన బాధ్యతాయుత ముఖ్యమంత్రి స్థానంలో ఉండి.. భూస్థాపితం చేస్తాము.. అంటే కుదరదు కదా! ఏదైనా రాజకీయంగా చూసుకోవచ్చు కానీ.. బహిరంగ వేదికలపై ఇలా వ్యాఖ్యానించడం ద్వారా.. బాబు సంయమనం కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటే బెటర్ అనేది రాజకీయ వర్గాల సూచన. పైగా.. అధినేతే ఇలా మాట్లాడితే.. క్షేత్రస్థాయి నాయకులు మరింత రెచ్చిపోతున్నారు. దీనివల్ల మరిన్ని ఇబ్బందులు రావడం ఖాయం.