చంద్రగిరి విషయంలో అయోమయం పెరిగిపోతోందా ?
చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరు. ఈ జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలు ఒక ఎత్తయితే చంద్రగిరి నియోజకవర్గం మరో ఎత్తు
చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరు. ఈ జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలు ఒక ఎత్తయితే చంద్రగిరి నియోజకవర్గం మరో ఎత్తు. ఎందుకంటే చంద్రగిరి చంద్రబాబు పుట్టిన, రాజకీయం మొదలుపెట్టిన ఊరు కాబట్టే. ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచి చాలా కాలమైపోయింది. 1994లో చివరిసారిగా టీడీపీ తరపున చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు గెలిచారు. అప్పటినుండి చంద్రగిరిలో గెలుపు టీడీపీకి అందని ద్రాక్షపండులాగ అయిపోయింది. ఎన్నిరకాలుగా ప్రయత్నం చేస్తున్నా ఎందుకనో టీడీపీ గెలవలేకపోతోంది.
ఇపుడు ప్రస్తుతానికి వస్తే 2024 ఎన్నికల్లో చంద్రగిరి నుండి పులివర్తి నాని పోటీచేస్తారని అంటున్నారు. ఇదే సమయంలో తిరుపతి మాజీ ఎంఎల్ఏ మబ్బు రామిరెడ్డి కొడుకు మబ్బు దేవనారాయణరెడ్డి(పెద్దబ్బ)ని పోటీచేయించాలని చంద్రబాబు అనుకున్నారనే ప్రచారం కూడా ఉంది. దాంతో వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ వస్తుందో తెలీక నేతలు, క్యాడర్లో గందరగోళం పెరిగిపోతోంది. సరిగ్గా ఈ నేపధ్యంలోనే రియాల్టర్ డాలర్ దివాకర్ రెడ్డి తెరమీదకు వచ్చారు. రాబోయే ఎన్నికల్లో తనకే టికెట్ అంటు దివాకరరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు.
రియాల్టర్ గా చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో దివాకర్ బాగా పాపులర్. చంద్రగిరి నియోజకవర్గంలో తనకు పట్టుంది కాబట్టి, అవసరమైన ఖర్చు పెట్టుకోగలనని చంద్రబాబు, లోకేష్ తో చెప్పారట. దానికి వాళ్ళిద్దరు సానుకూలంగా స్పందించారని పార్టీలో ప్రచారం పెరిగిపోతోంది. దాంతో టికెట్ కోసం ఇపుడు ముగ్గురి మధ్య రేసు జరుగుతోంది. అయితే వివిధ కారణాలతో పెద్దబ్బ పేరు ఈమధ్య ఎక్కడా వినబడటంలేదు. పెద్దబ్బను చంద్రబాబు లేదా లోకేషే తప్పించారా లేకపోతే పెద్దబ్బే తప్పుకున్నారా అన్న విషయంలో క్లారిటిలేదు. ప్రస్తుతానికి పులివర్తి, డాలర్ పేర్లు మాత్రమే వినబడుతున్నాయి.
నానీయేమో చాలాకాలంగా చంద్రగిరి పార్టీలో పనిచేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన అనుభవం కూడా ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో గెలుపుకు ప్లాన్ చేసుకుంటున్నారు. డాలర్ కు టికెట్ ఇస్తే కొత్త అభ్యర్ధి అవుతారు. ఇదే సమయంలో వైసీపీలో ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అభ్యర్దిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. వివాదాలు లేని, పొత్తుతో సంబంధంలేని నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు టికెట్లను ఫైనల్ చేయకపోవటమే పార్టీకి అతిపెద్ద మైనస్ కాబోతోంది. మరి ఇక్కడ ఏమవుతుందో చూడాలి.