జయహో భారత్: చంద్రుడిని ముద్దాడిన చంద్రయాన్ - 3..!

అనంతరం సెకనుకు మూడు మీటర్ల వేగంతో చంద్రయాన్ - 3.. చంద్రుడి ఉపరితలాన్ని తాకింది.

Update: 2023-08-23 12:43 GMT

జాబిల్లిపై మన వ్యోమనౌక అడుగుపెట్టే చారిత్రక క్షణం వచ్చేసింది. 140కోట్లకు పైగా భారతీయులను మునివేళ్లపై నిలబెట్టే క్షణం రానే వచ్చింది. నాలుగు సంవత్సరాల కఠోర శ్రమ.. 41 రోజుల ప్రయాణం.. దశాబ్దాల కలలు నిజం అయ్యాయి. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ఆ అపరూప ఘట్టం ఆవిష్కృతమైంది.

ఇందులో భాగంగా సాయంత్రం 5.44 గంటల తర్వాత ల్యాండింగ్‌ ప్రక్రియ మొదలయ్యింది. 17 నిమిషాలపాటు సాగే ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉంటుందనేది తెలిసిన విషయమే. అందుకే దీన్ని "17 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌"గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. గంటకు దాదాపు 6 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వ్యోమనౌక ఈ 17 నిమిషాల్లో అత్యంత స్లోగా మారి సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యింది.

ల్యాండింగ్‌ ప్రక్రియ సాగిందిలా..:

ల్యాండర్‌ మాడ్యూల్‌ లో పారామీటర్లు అన్నింటినీ తనిఖీ చేసి, ఎక్కడ ల్యాండ్‌ అవ్వాలో నిర్దేశించుకున్న తర్వాత ఇస్రో సంబంధిత కమాండ్లను ల్యాండర్‌ మాడ్యూల్‌ కు అప్‌ లోడ్‌ చేసింది. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం చంద్రుడి ఉపరితలానికి 30 కి.మీల ఎత్తులో ల్యాండర్ పవర్‌ “బ్రేకింగ్‌ దశ”లోకి అడుగుపెట్టింది.

అప్పుడు మొదలైంది అసలు టెన్షన్... అదే "17 మినిట్స్ టెర్రర్‌"! ఈ సమయంలో జాబిల్లి ఉపరితలానికి చేరువయ్యేందుకు ల్యాండర్‌ తన నాలుగు ఇంజిన్లను మండించుకుంది. జాబిల్లి గురుత్వాకర్షణకు అనుగుణంగా ఈ ప్రక్రియ కొనసాగింది.

అప్పటికి ల్యాండర్‌ ఇంకా జాబిల్లి ఉపరితలానికి సమాంతరంగానే ఉంది. దీన్ని "రఫ్‌ బ్రేకింగ్‌ దశ" అంటారు. ఇదంతా 11 నిమిషాల పాటు సాగింది. ఆ తర్వాత చంద్రయాన్‌-3, 90 డిగ్రీలు వంపు తిరిగింది. అప్పుడు చంద్రుడి ఉపరితలంపై నిలువు స్థానానికి వచ్చింది. దీన్ని "ఫైన్‌ బ్రేకింగ్‌ దశ" అంటారు!

అలా క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ జాబిల్లి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత వేగాలు సున్నాకు చేరుకున్నాయి. ఆ సమయంలో ల్యాండర్‌ అనువైన ప్రదేశం కోసం అన్వేషించింది.

ఆ తర్వాత మరింత కిందకు దిగింది. ఈ సమయంలో మరోసారి ల్యాండింగ్‌ కోసం కాస్త చదునుగా ఉన్న ప్రదేశం కోసం వెతికింది. అనంతరం సెకనుకు మూడు మీటర్ల వేగంతో చంద్రయాన్ - 3.. చంద్రుడి ఉపరితలాన్ని తాకింది.

దీంతో యావత్ భారత దేశం మొత్తం ఒక్కసారిగా కేరింతలు కొట్టింది.. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది.. శాస్త్రవేత్తలు సంతోషంతో చెమర్చిన కళ్లతో ఆకాశంవైపు చూశారు.. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.. ప్రపంచం మొత్తం కరతాళ ధ్వనులు చేసింది.. జయహో భారత్!

14 రోజుల జీవితకాలంలో...:

విక్రమ్‌, ప్రగ్యాన్‌ ల జీవితకాలం 14 రోజులు మాత్రమే. చంద్రుడిపై సూర్యరశ్మి ఉన్నంతసేపే.. అంటే ఒక లూనార్‌ పగలే. ఈ సమయంలోనే వాటిలోని అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తాయి. అనంతరం లూనార్ పగలు ముగిసిన అనంతరం సూర్యాస్తమయం అవుతుంది. అనంతరం మొత్తం అంధకారంగా మారుతుంది.

ఇలా సూర్యాస్తమయం అయిన తర్వాత చంద్రుడిపై టెంపరేచర్ ఒక్కసారిగా పడిపోతాయి. ఇందులో భాగంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మైనస్‌ 180 డిగ్రీల సెల్సియస్‌ కు పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో వ్యవస్థలు మనుగడ సాగించడం సాధ్యం కాదు.

ఈ 14 రోజులలో చంద్రయాన్‌-3 ల్యాండర్‌, రోవర్‌ లలో ఉన్న మొత్తం ఐదు పేలోడ్‌ లు.. జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను అవి నిశితంగా శోధిస్తాయి.

Tags:    

Similar News