చంద్రయాన్ సక్సెస్.. 24 వేలకోట్లు తిరిగివ్వండి.. బ్రిటీష్ జర్నలిస్టు అక్కసు
అదేం చోద్యమో..? తమకు చేత కాని దానిని మిగతా దేశాలు.. అందులోనూ ఆసియా దేశాలు సాధిస్తే పాశ్చాత్య దేశాలు ఓర్వలేవు
అదేం చోద్యమో..? తమకు చేత కాని దానిని మిగతా దేశాలు.. అందులోనూ ఆసియా దేశాలు సాధిస్తే పాశ్చాత్య దేశాలు ఓర్వలేవు. బహుశా వారికున్న అహంకారమే కారణమేమో..? చంద్రయాన్ -3పై ఇప్పటికే కడుపు మంట వెళ్లగక్కిన బ్రిటీష్ మీడియా, భావ దారిద్ర్యాన్ని చాటుకున్న వారు.. ఇంకా ఏడుపు ఆపడం లేదు.. భారత్ లో పేదిరికం తాండవిస్తుండగా.. అంతరిక్ష కార్యక్రమానికి పెద్దమొత్తంలో ఖర్చు అవసరమా?? అంటూ చర్చా కార్యక్రమంలో నోరు పారేసుకున్న వారే.. ఇప్పుడు మీ చంద్రయాన్-3 సక్సెస్ అయిందిగా..? గతంలో తీసుకున్న డబ్బులు తిరిగివ్వండి అంటూ పేద అరుపులు అరుస్తోంది.
ఎందుకిచ్చారు..? ఎందుకివ్వాలి..?
డెవలప్ అవుతున్న దేశాల్లో వివిధ కార్యక్రమాల కోసం.. డెవలప్ అయిన దేశాలు వివిధ వేదికల ద్వారా నిధులు పంపుతాయి. ఇది ఓ సంప్రదాయంగా కొనసాగుతోంది. అంతెందుకు భారత్ సైతం పేద దేశాలకు తనవంతుగా ఆర్థిక, ఔషధ తదితర సాయం అందిస్తుంటుంది. కొవిడ్ సమయంలో వ్యాక్సిన్ ను ఇలాగే ఉచితంగా అందజేసి మానవత్వం చాటుకుంది. ఇక.. భారత్ కు కూడా పాశ్చాత్య దేశాలు వేర్వేరు కార్యక్రమాల కోసం నిధులు సమకూర్చాయి. ఇది ఓ ఆన్ గోయింగ్ ప్రాసెస్. జపాన్ వంటి దేశాల సంస్థలు భారత్ లో సాగునీటి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయిలు ఇచ్చాయి. ఇలానే , 2016-21 మధ్య బ్రిటన్ ప్రభుత్వం రూ.24,081 కోట్లను భారత్ కు ఇచ్చింది. చంద్రయాన్ -3 విజయంతో కుళ్లుకుంటున్న ఆ దేశ మీడియా కన్ను ఇప్పుడు ఈ సాయంపై పడింది. సహాయ నిధిగా అందించిన రూ.24 వేల కోట్లను భారత్ తిరిగివ్వాలని బ్రిటీష్ జర్నలిస్టు ప్యాట్రిక్ క్రిస్టీన్ కోరాడు.
అభినందిస్తూనే రోదనలు..
చంద్రయాన్-3 విజయవంతం అయినుందకు అభినందిస్తూనే ప్యాట్రిక్ ఏడుపు తగులుకున్నాడు. 'మా ప్రభుత్వం ఇచ్చిన రూ.24 వేల కోట్లు తిరిగివ్వండి' అంటూ అసంబద్ధమైన డిమాండ్ ను తెచ్చాడు. ఈ మేరకు X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. భారత్ ను అసలు తమ ప్రభుత్వం ఎందుకు ఆదుకోవాలని ప్రశ్నించాడు. అంతేకాదు.. వచ్చే ఏడాది రూ. 597 కోట్లు ఇవ్వనున్న విషయాన్ని చెబుతూ.. బ్రిటిష్ పన్ను చెల్లింపుదారులు దానిని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు వివరించాడు.
అంతరిక్ష కార్యక్రమాలుంటే డబ్బివ్వరట..
చంద్రయాన్ 3 దిగ్విజయంతో అసూయ పడుతున్న అతడు.. అసలు మా నిబంధనలు ఇవీ అంటూ చిత్రమైన వాదనను తెరపైకి తెచ్చాడు. వారి నియమాల ప్రకారం అంతరిక్ష కార్యక్రమం ఉన్న దేశాలకు డబ్బు ఇవ్వకూడదనే దు అని పేర్కొన్నాడు. కాగా, అతడి వీడియోపై విపరీతమైన కామెంట్లు వచ్చాయి. చాలామంది ప్యాట్రిక్ క్రిస్టీన్ మాటలను తప్పుబట్టారు.
నువ్వో జాత్యహంకారి..
''క్రిస్టీన్ ఈర్ష్యతో కూడిన జాత్యహంకారి'' అంటూ భారత నెటిజన్లు తప్పుబట్టారు. మా దేశం నుంచి $45 ట్రిలియన్లకు పైగా దొంగిలించారు. దేశాన్ని ఛిన్నాభిన్నం చేశారు. పేదరికాన్ని మిగిల్చారు. అయినా.. దానిని భారత్ తట్టుకుని నిలిచింది. మీ ఆర్థిక వ్యవస్థనే అధిగమించింది అంటూ నిప్పులు చెరిగారు. "ప్రజలు మిమ్మల్ని పిలిచినప్పుడు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి, ఆ తర్వాత కేకలు వేయండి'' అంటూ మండిపడ్డారు. అసలు 2015 నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందించలేదని మరొకరు పేర్కొన్నారు. ఇంకొక నెటిజన్ అయితే.. "నువ్వు చెత్త మనిషివి. జాత్యహంకార జాతికి నీవో చక్కటి ఉదాహరణ" అంటూ నిప్పులు చెరిగారు.