ఏడుపులందు చైనా ఏడుపే వేరయా?

ఆసియా ఖండంలోనే కాకుండా ప్రపంచంలోనే పెద్ద దేశాలు.. చైనా, భారత్‌. ఇరుగు పొరుగు దేశాలైన ఈ రెండూ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి

Update: 2023-09-28 13:30 GMT

ఆసియా ఖండంలోనే కాకుండా ప్రపంచంలోనే పెద్ద దేశాలు.. చైనా, భారత్‌. ఇరుగు పొరుగు దేశాలైన ఈ రెండూ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఇదే చైనాకు కంటగింపుగా మారుతోంది. ఆర్థికంగా, సైనికపరంగా, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ తమతో సమానంగా ధీటుగా ఎదగడాన్ని చైనా తట్టుకోలేకపోతోంది. భారత్‌ ఆయా రంగాల్లో ప్రపంచ స్థాయి విజయాలు సాధించనప్పుడల్లా తట్టుకోలేక కుతకుతలాడిపోతోంది. తాజాగా భారత్‌ ఇటీవల నిర్వహించిన చంద్రయాన్‌ ప్రయోగంపై చైనా అక్కసు వెళ్లగక్కింది.

ఇటీవల భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌ లోని ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన సంగతి తెలిసిందే. తద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ ను దింపిన తొలి దేశంగా భారత్‌ రికార్డులు సృష్టించింది. అంతేకాకుండా మొత్తం మీద చంద్రుడి మీద ల్యాండర్‌ ను దింపిన నాలుగో దేశం చరిత్ర సృష్టించింది.

ఈ నేపథ్యంలో చైనా తన అక్కసు వెళ్లగక్కుతూ విద్వేష వ్యాఖ్యలు చేసింది. భారత శాస్త్రవేత్తలు మంచుతో నిద్రావస్థలోకి జారిపోయిన ల్యాండర్, రోవర్‌ లను తిరిగి యాక్టివేట్‌ చేయడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో చైనా మొదటి చంద్రయాన్‌ మిషన్‌ లో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఓయాంగ్‌ జియువాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్‌–3 చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద దిగలేదన్నారు. దక్షిణ ధ్రువంపైన దిగకుండానే దిగినట్టు భారత్‌ చారిత్రక విజయాన్ని నమోదు చేసినట్టు చెప్పుకుందని హాట్‌ కామెంట్స్‌ చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద లేదా సమీప ప్రాంతంలో భారత అంతరిక్ష నౌక దిగలేదని కూడా ఆయన వెల్లడించారు.

చంద్రయాన్‌–3 ల్యాండింగ్‌ సైట్‌ చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద కాదు, చంద్రుని దక్షిణ ధ్రువం.. భారత్‌ చెబుతున్న ప్రాంతంలో లేదని ఓయాంగ్‌ వ్యాఖ్యానించారు. అలాగే అది అంటార్కిటిక్‌ ధ్రువ ప్రాంతానికి సమీపంలో కూడా లేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు చైనా అధికారిక సైన్స్‌ టైమ్స్‌ వార్తా పత్రికతో మాట్లాడుతూ ఓయాంగ్‌ జియువాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రుడిపై దక్షిణ ధ్రువం తమ ల్యాండర్‌ దిగిన ప్రాంతమేనని భారత్‌ చెబుతుండటం సరికాదని ఓయాంగ్‌ జియువాన్‌ అంటున్నారు. భూమిపై.. దక్షిణ ధ్రువం 66.5 – 90 డిగ్రీల మధ్య ఎక్కడైనా నిర్వచించబడింది అని చెబుతున్నారు. ఎందుకంటే దాని భ్రమణ అక్షం సూర్యుడికి సంబంధించి 23.5 డిగ్రీల వద్ద వంగి ఉంటుందని ఆయన పేర్కొంటున్నారు.

చంద్రుని వంపు కేవలం 1.5 డిగ్రీలు మాత్రమే కాబట్టి ధ్రువ ప్రాంతం చాలా చిన్నదిగా ఉందని ఓయాంగ్‌ తన వాదన వినిపించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చంద్రుని దక్షిణ ధ్రువాన్ని 80 నుండి 90 డిగ్రీలుగా పరిగణిస్తుందన్నారు. అయితే చంద్రుని యొక్క 1.5 డిగ్రీల వంపు 88.5 నుండి 90 డిగ్రీల వద్ద మరింత చిన్నదిగా ఉంటుందన్నారు.

వాస్తవానికి చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌–3ని విజయవంతంగా ల్యాండింగ్‌ చేయడాన్ని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ తదితర దేశాలతోపాటు యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ కూడా ప్రశంసించింది. దీనికి తమ దేశ పత్రికల్లో పతాక శీర్షికల్లో భారత్‌ ను పొగుడుతూ వార్తలు ప్రచురించాయి. చైనా మాత్రమే తన వక్రబుద్ధిని చాటుకుంది.

ఈ నేపథ్యంలో చైనా అంతరిక్ష శాస్త్రవేత్త ఓయాంగ్‌ జియువాన్‌ పై హాంకాంగ్‌ విశ్వవిద్యాలయానికి అంతరిక్ష శాస్త్రవేత్త క్వెంటిన్‌ పార్కర్‌ మండిపడ్డారు. చైనా శాస్త్రవేత్త వ్యాఖ్యలు నిరాధారమని తెలిపారు. భారత్‌ ఖచ్చితంగా చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలోనే ల్యాండర్‌ ను దింపిందని తేల్చిచెప్పారు. కాబట్టి భారత్‌ విజయవంతం కావడంపై ఎలాంటి వివాదాలకు చోటు లేదని స్పష్టం చేశారు. మరి ఈ మాటలు చైనా చెవికి ఎక్కుతాయా?!

Tags:    

Similar News