చంద్రయాన్‌.. ఎప్పుడూ చూడని చంద్రుడి అవతలవైపు చిత్రాలివే!

విక్రమ్‌ ల్యాండర్‌కు అమర్చిన ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవైడెన్స్‌ కెమెరా.. భూమికి కన్పించని జాబిల్లి అవతలివైపు ఫొటోలను తీసింది.

Update: 2023-08-21 07:27 GMT

130 కోట్ల మందికి పైగా భారతీయుల ఆశల్ని మోసుకుంటూ చంద్రయాన్‌–3 జాబిల్లి వైపు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏ దేశం సాహసించని ప్రయోగానికి భారత్‌ సిద్ధమైంది. అదే చంద్రుడి దక్షిణ ధ్రువం. దీనిపై ఇప్పటివరకు ఎవరూ కాలు మోపలేదు. చంద్రుడి దక్షిణ ధ్రువం చాలా సంక్లిష్టంగా ఉండటమే ఇందుకు కారణం.


ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి చంద్రయాన్‌–3 కేవలం అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడానికి కేవలం 100 కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ఉంది. అంతా సవ్యంగా జరిగితే ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ కాలు మోపుతుంది.


ఈ నేపథ్యంలో చందమామపై కాలుపెట్టే చారిత్రక ఘట్టం కోసం చంద్రయాన్‌–3 శరవేగంగా అడుగులు వేస్తోంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్‌ ల్యాండర్‌ అన్వేషణ సాగిస్తోంది. ఈ క్రమంలోనే భూమికి ఎప్పుడూ కన్పించని జాబిల్లి దక్షిణ ధ్రువం ఉండే ప్రాంతం చిత్రాలను ల్యాండర్‌ తన కెమెరాలో బంధించింది. వీటిని ఇస్రో తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేయడంతో వైరల్‌ అవుతున్నాయి.


"విక్రమ్‌ ల్యాండర్‌కు అమర్చిన ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవైడెన్స్‌ కెమెరా.. భూమికి కన్పించని జాబిల్లి అవతలివైపు ఫొటోలను తీసింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయ్యే ప్రాంతాన్ని గుర్తించేందుకు ఈ కెమెరా సాయపడుతుంది. బండరాళ్లు, లోతైన కందకాలు లేని ప్రదేశం కోసం ల్యాండర్‌ అన్వేషిస్తోంది" అని ఇస్రో సోషల్‌ మీడియాలో వెల్లడించింది.


ఆగస్టు 19న ల్యాండర్‌ ఈ ఫొటోలు తీసినట్లు ఇస్రో తెలిపింది. కాగా తాజా ఫొటోల్లోనూ జాబిల్లి ఉపరితలంపై అనేక బిలాలు స్పష్టంగా అగుపిస్తున్నాయి. వాటి పేర్లను కూడా ఇస్రో తాము విడుదల చేసిన ఫొటోల్లో పేర్కొంది.

ప్రస్తుతం ల్యాండర్‌ జాబిల్లి చుట్టూ ఉన్న 25x134 కి.మీల కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై కాలుమోపనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇది విజయవంతమైతే.. జాబిల్లిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన సోవియట్‌ యూనియన్‌ (ప్రస్తుత రష్యా), అమెరికా, చైనా సరసన భారత్‌ కూడా నిలుస్తుంది.

కాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా, భారత్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రోలు సంయుక్తంగా చేపట్టిన నిసార్‌ (నాసా–ఇస్రో సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌)ను వచ్చే ఏడాది శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. నిసార్‌ తర్వాత మరిన్ని ప్రాజెక్టులను ఉమ్మడిగా చేపడతామని నాసా శాస్త్రవేత్త, భారతీయ అమెరికన్‌ భవ్యా లాల్‌ తెలిపారు. ఈ విషయంపై చర్చించడానికి ఇస్రో ఛైర్మన్‌ అమెరికాలో పర్యటించారన్నారు. అలాగే నాసా అధిపతి త్వరలో భారత్‌ను సందర్శిస్తారని చెప్పారు. అర్టెమిస్‌ కార్యక్రమం కింద ఈ రెండు అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా అద్భుత ప్రయోగాలు చేపడతాయని ఆమె వెల్లడించారు.

చంద్రయాన్‌ యాత్రల ద్వారా జాబిల్లికి సంబంధించి విలువైన సమాచారం వెలుగులోకి వస్తోందని భవ్యా లాల్‌ అభిప్రాయపడ్డారు. దానిపై నీటి రేణువుల ఆచూకీని చంద్రయాన్‌–1 ఆర్బిటర్‌ కనుగొందని గుర్తు చేశారు.

అలాగే భూమి తొలినాటి చరిత్ర, పరిణామక్రమం గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవడంతో పాటు సాంకేతిక పురోగతికి జాబిల్లి యాత్రలు ఉపయోగపడతాయని భవ్యా లాల్‌ చెప్పారు. ప్రొపల్షన్, కమ్యూనికేషన్, నేవిగేషన్, రోబోటిక్స్, మానవ ఆరోగ్యం వంటి రంగాల్లో సాంకేతిక ఆవిష్కరణలకూ వీలు కలిగిస్తాయన్నారు. పరిశ్రమలకూ వీటివల్ల ఊతం లభిస్తోందని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News