వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్

చంద్రగిరి ఎమ్మెల్యే టీడీపీ నేత పులివర్తి నానిపై దాడి కేసుకు సంబంధించి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు.

Update: 2024-07-27 17:45 GMT

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనయుడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను బెంగళూరు ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే టీడీపీ నేత పులివర్తి నానిపై దాడి కేసుకు సంబంధించి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు.

ఇక ఆయనను ఆదివారం ఉదయం మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా పోలింగ్ అనంతరం అంటే మే నెల 14న తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లిన క్రమంలో టీడీపీ నేత పులివర్తి నానిపై దాడి జరిగింది. ఈ దాడిలో మోహిత్ రెడ్డి ప్రమేయం ఉందని ఆయన నిందితుడు అని పోలీస్ వర్గాలు తెలిపాయి.

దాంతో ఈ దాడి ఘటనకు సంబంధించి హత్యాయత్నం సెక్షన్ తో మోహిత్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

ఈ క్రమంలోనే తాజాగా తిరుపతి పోలీసులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడైన మోహిత్ రెడ్డి ఈ కేసులో 37వ నిందితుడిగా ఉన్నారు. ఇదిలా ఉంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయడం వైసీపీలో కలకలం రేపుతోంది.

Tags:    

Similar News