సీఎంను విమర్శించిన జర్నలిస్టును ఎంత దారుణంగా దాడి చేశారంటే?
దేశ రాజకీయాలు దారుణ రీతిలో మారిపోతున్నాయి. అధికారంలో ఉన్న వారు విమర్శల్ని ఎదుర్కోవటానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు
దేశ రాజకీయాలు దారుణ రీతిలో మారిపోతున్నాయి. అధికారంలో ఉన్న వారు విమర్శల్ని ఎదుర్కోవటానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. ప్రశ్నించే వారి గొంతు నులిమేయటమే కాదు.. నోరెత్తి మాట్లాడితే మీకు ఇలాంటి గతే అన్నట్లుగా చెలరేగిపోయే ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. గతంలో తమ ఇమేజ్ కు భంగం వాటిల్లేలా వ్యవహరించే వారిని ఎవరూ చూడకుండా దాడి చేయటం లాంటివి చేసేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా అందరూ చూస్తుండగానే తీవ్రస్థాయిలో దాడికి వెనుకాడటం లేదు. తాజాగా ఈ తరహా ఉదంతం మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
ఒక బాలిక దారుణ హత్య మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను.. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేను క్వశ్చన్ చేసిన జర్నలిస్టుపై దారుణ రీతిలో దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఎంత అధికారం ఉంటే మాత్రం మరీ ఇంతలా దాడి చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. జలగావ్ జిల్లాకు చెందిన ఒక బాలికను చిత్రహింసలు పెట్టి హత్య చేసిన ఉదంతం అక్కడ పెను సంచలనంగా మారింది.
ఈ అంశంపై స్పందించిన జర్నలిస్టు సందీప్ మహాజన్.. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మీదా.. జల్గావ్ -పచోరా తాలుకా ఎమ్మెల్యే కిశోర్ ను విమర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టు సందీప్ కు ఫోన్ చేసి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆడియో బయటకు వచ్చి వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన అధికార పార్టీ ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ తనదేనని.. తాను జర్నలిస్టును తిట్టటం..కొడతానని బెదిరించటం నిజమేనని ఒప్పుకున్నారు.
ఫోన్ లో దుర్భాషలాడిన క్లిప్ బయటకు వచ్చిన పక్క రోజునే.. తన టూవీలర్ మీద వెళుతున్న జర్నలిస్టు సందీప్ పై ముఖ్యమంత్రి వర్గానికి చెందిన వారు దాడి చేశారు. రోడ్డు మీద వెళుతున్న అతన్ని అడ్డుకొని.. తీవ్రంగా గాయపర్చారు. అదే పనిగా కొట్టేసిన వైనంతో సదరు జర్నలిస్టు కిందపడిపోగా.. అతడ్ని రోడ్డు మీద చితకబాదిన వీడియో వైరల్ గా మారింది. మహారాష్ట్రలో జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా తప్పు పడుతున్నారు. అయినప్పటికీ.. పాత్రికేయ సంఘాలు సైతం ఈ చర్యను తప్పు పట్టకపోవటం గమనార్హం. మహారాష్ట్రలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయన్న దానికి ఈ వైరల్ వీడియో ఒక ఉదాహరణగా పేర్కొంటున్నారు.