గులాబీ బాస్ ప్లాన్ బెడిసికొట్టిందా?
ఏం చేసినా.. ఏలాంటి నిర్ణయం తీసుకున్నా.. కేసీఆర్ కు మేలు చేకూరేలా ఉండటం తెలిసిందే
లెక్కల్లోనూ.. వ్యూహాల్లోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో గులాబీ బాస్ కేసీఆర్ కు మించిన తోపు మరొకరు లేరన్న మాట తరచూ పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ఆయనేం చేసినా.. మిగిలిన వారికి అందని.. చూడని.. పరిగణలోకి తీసుకోని పలు అంశాలు ఉంటాయన్న వాదనను వినిపిస్తూ ఉంటారు. ఫాంహౌస్ లో పడుకుంటారన్న మాట కేసీఆర్ ను ఉద్దేశించి అదే పనిగా అంటుంటారని.. కానీ.. తెలంగాణ దూసుకెళ్లటానికి ఫామ్ హౌస్ నిర్ణయాలే కారణమన్న వాదనా వినిపిస్తూ ఉంటుంది. అయితే.. టైం బాగా నడుస్తున్నప్పుడు ఏం చేసినా అలానే ఉంటుందన్న వ్యాఖ్య కొందరి నోటి నుంచి వస్తూ ఉంటుంది.
ఏం చేసినా.. ఏలాంటి నిర్ణయం తీసుకున్నా.. కేసీఆర్ కు మేలు చేకూరేలా ఉండటం తెలిసిందే. అయితే.. ఇటీవల ఆయన ప్రకటించిన అభ్యర్థుల జాబితా లెక్క మాత్రం తప్పిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. రాష్ట్రంలో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు మూడు నెలలకు ముందుగా అభ్యర్థుల్ని ఫైనల్ చేయటం.. 119 స్థానాలకు 115 మంది అభ్యర్థుల్ని తేల్చేయ టం సంచలనంగా మారింది. ఇప్పటికే ప్రకటించిన 115 స్థానాల్లో కేవలం ఎనిమిది మంది మాత్రమే మార్చిన వైనం ఇప్పుడు గులాబీ తోటలో ఆందోళనల బాట పట్టేలా చేశాయంటున్నారు.
టికెట్లు రాని వారి ఆవేదన.. ఆక్రోశం ఒకలా ఉంటే.. గడిచిన రెండు దఫాలుగా టికెట్లు ఆశిస్తూ.. ఈసారైనా తమకు టికెట్ దక్కుతుందన్న అంచనాలకు భిన్నంగా గులాబీ బాస్ మండి చేయి చూపించటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తమ గళాన్ని విప్పేందుకు వెనుకాడటం లేదు. బాహాటంగానే కొందరు మాట్లాడుతుంటే.. మరికొందరు చేతలతో చూపిస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య కావొచ్చు.. కేసీఆర్ కేబినెట్ లో ఒక వెలుగు వెలిగిన తుమ్మల కావొచ్చు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. బోలెడంత మంది టికెట్లు రాని వారు తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు.
నిజానికి అభ్యర్థుల జాబితాకు.. నామినేషన్లకు మధ్య బెలెడంత గడువు ఉండటంతో ఇప్పుడు ఎవరికి వారు కేసీఆర్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పటికీ.. బీ ఫారం ఇచ్చే వేళలో అధినేత పలువురి అభ్యర్థిత్వాల్ని మారుస్తారన్న ప్రచారం సాగుతోంది. దీంతో.. టికెట్లు ఆశించి భంగపడిన వారు సైతం పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.
ఇదంతా చూస్తే.. అభ్యర్థుల్ని ఊరికి ముందే పిలిచేయటం ద్వారా.. లేని పంచాయితీని మీద ఏసుకున్నట్లుగా మారిందన్న మాట వినిపిస్తోంది. టికెట్ల లొల్లి పుణ్యమా అని బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీకి మంచిదికాదంటున్నారు. అన్ని అంశాల్ని లోతుగా అధ్యయనం చేసే కేసీఆర్.. తాను విడుదల చేసిన అభ్యర్తుల జాబితా తదనంతర పరిస్థితుల్ని అంచనా వేయటంలో ఫెయిల్ అయ్యారా? అన్నదిప్పుడు సందేహంగా మారింది. అదే జరిగితే.. అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుందని చెప్పక తప్పదు.