బీజేపీలోకి క్యాసినో కింగ్‌!

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణల ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Update: 2023-08-03 10:35 GMT

క్యాసినో కింగ్‌ గా పేరు పొందిన చికోటి ప్రవీణ్‌ గురించి తెలియని వారుండరు. మనదేశంలో వివిధ ప్రాంతాలతోపాటు నేపాల్, థాయ్‌లాండ్, శ్రీలంక అడ్డాలుగా చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలు నిర్వహించిన క్యాసినో వ్యవహారం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో 16 మంది ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మంత్రులు, మాజీ మంత్రులు సైతం విదేశాలకు వెళ్లి క్యాసినోలు ఆడివచ్చారని గతం లో వార్తలు వచ్చాయి. అయితే క్యాసినో అనేది ముసుగు మాత్రమేనని.. పెద్ద ఎత్తున నల్లధనాన్ని తరలించి దాన్ని వైట్‌ గా మళ్లీ దేశంలోకి తెచ్చుకున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి.

క్యాసినో కింగ్‌ గానే కాకుండా చికోటి ప్రవీణ్‌ వ్యక్తిగత జీవితం అంతే వివాదానికి దారితీసింది. తన ఫామ్‌ హౌసు లో వివిధ రకాల జంతువులను, పక్షులను, వన్యప్రాణుల ను ఆయన పెంచడం, ఇందుకు సంబంధించి ఫొటోలు పెద్ద ఎత్తున వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలో ఆయన జంతు సంరక్షణ చట్టాలను సైతం ఉల్లంఘించారని ఆరోపణలు కూడా వచ్చాయి. మరోవైపు క్యాసినోల వ్యవహారంలో ఆయన పై కేసులు నమోదయ్యాయి.

కాగా చికోటి ప్రవీణ్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు ఊతమిచ్చేలా ఆయన ఢిల్లీలో తాజాగా బీజేపీ ప్రముఖులను కలుసుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణల ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వారిని కలిసిన చికోటి ప్రవీణ్‌ వారికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. వీరినే కాకుండా మరికొంతమంది ఇతర నేతలను కూడా ఆయన కలిశారు.

ఈ ఏడాది చివర లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చికోటి ప్రవీణ్‌ అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ నేతల ను కలిసి తన ఆసక్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. చికోటి ప్రవీణ్‌ కు ఆర్థిక బలం పుష్కళంగా ఉంది. ఈ నేపథ్యంలో తనకు అధికార బలం కూడా ఉంటే కేసులు తనను ఇబ్బంది పెట్టవని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ లోకి వస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చికోటి ప్రవీణ్‌ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన బండి సంజయ్, డీకే అరుణల ను కలిసి బీజేపీ లోకి రావాలనే ఆకాంక్షను వ్యక్తం చేసినట్టు తెలిసింది.

హైదరాబాద్‌ నగర పరిధిలో గోషా మహల్‌ లేదా మలక్‌ పేట నుంచి పోటీకి చికోటి ప్రవీణ్‌ ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ సైతం ఆర్థిక బలం పుష్కళంగా ఉన్న నేతల పై దృష్టి సారించిన నేపథ్యంలో చికోటి ప్రవీణ్‌ కు టికెట్‌ ఖాయమేనని అంటున్నారు.

Tags:    

Similar News