చైనా నయా చరిత్ర.. చందమామ ఆవలి మట్టి భూమ్మీదకు

ఆ దేశం ఏం చేసినా అంతే.. అందరూ నడిచే బాటలో కాకుండా కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంది.

Update: 2024-06-25 10:17 GMT

ఆ దేశం ఏం చేసినా అంతే.. అందరూ నడిచే బాటలో కాకుండా కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంది. తనకు అసాధ్యం అన్నది లేకుండా చేస్తుంది. ఇప్పుడు కూడా అలాగే ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. మరే దేశానికి అయినా అది సాధ్యం అవుతుందా? అంటే అది చెప్పలేని పరిస్థితి.

కనిపించని అటువైపు నుంచి..

మనకు కనిపించే చంద్రుడు ఒకవైపే. అవతలి వైపు ఎప్పటికీ కనిపించడు. అలాంటిచోట నుంచి మరే దేశానికీ ఇంతవరకు మట్టి, శిథిలాలను తీసుకురావడం వీలు పడలేదు. అలాంటి పనిని సులభం చేసింది చైనా. ఆ దేశానికి చెందిన లూనార్ ల్యాండర్ చాంగే-6 వ్యోమనౌక ద్వారా ఈ పనిని సుసాధ్యం చేసింది. భారత్ సహా అనేక దేశాలు చంద్ర మండల యాత్రలు సాగించాయి. వాటిలో దేనికీ ఈ పని సాధ్యం కాలేదు.

చైనా తన లూనార్‌ ల్యాండర్‌ చాంగే-6ను మే 3న ప్రయోగించింది. ఇది చంద్రుడి అవతలి వైపు ఉన్న మట్టితో ఉత్తర చైనాలోని ఇన్నర్‌ మంగోలియాలో మంగళవారం సురక్షితంగా దిగింది.

కాగా, లూనర్ చాంగే దాదాపు 53 రోజులు ప్రయాణించింది. జూన్‌ 2న జాబిల్లి పైన సౌత్‌ పోల్‌-అయిట్కిన్‌ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్‌ లో దిగింది. ఈ మిషన్‌ లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్‌ అనే నాలుగు భాగాలు ఉన్నాయి.

రోబో చేతితో..

చంద్రుడి ఉపరితలంపై ఉన్న నమూనాలను చైనా లూనార్ ల్యాండర్ చాంగే-6 తన రోబో చేతితో సేకరించింది. డ్రిల్లింగ్‌ యంత్రాన్ని దీనికోసం ఉపయోగించింది. కిందనున్న ప్రాంతం నుంచి మట్టిని తీసుకొని వచ్చింది.

ఆ నమూనాల్లో ఏమున్నాయ్..

చాంగే-6 తెచ్చిన నమూనాల్లో 2.5 మిలియన్‌ ఏళ్ల అగ్నిపర్వత శిలలు ఉంటాయనేది చైనా శాస్త్రవేత్తల అంచనా. వీటిపై పరిశీలన జరిపితే చంద్రుడికి రెండు వైపులా ఉన్న భౌగోళిక వ్యత్యాసాలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని భావిస్తున్నారు.

ఒకవైపే ఎందుకు కనిపిస్తుంది..?

చంద్రుడికి ఒకవైపే ఎందుకు కనిపిస్తుంది..? మరోవైపు ఎప్పటికీ ఎందుకు కనిపించదు..? అనేది చాలామంది సందేహం. భూమికి సహజ ఉపగ్రహం చంద్రుడు. మనకు కనిపించేంది మాత్రం ఎప్పటికీ ఒకటే వైపు. దీనినే ఇంగ్లిష్ లో నియర్‌ సైడ్‌ అంటారు. ఆ కనిపించని రెండో భాగాన్ని ఫార్‌ సైడ్‌ గా పిలుస్తారు.

అమెరికా, సోవియట్‌ యూనియన్‌ తో పాటు చైనా కూడా పలుసార్లు నియర్‌ సైడ్‌ నమూనాలనే భూమికి తెచ్చాయి. ఫార్ సైడ్ (అవతలి భాగం) నుంచి తీసుకురాలేకపోయాయి. ఇప్పుడు ఆ పనిని చైనా చేసింది.

చంద్రుడి రెండు ప్రాంతాలు దేనికవే భిన్నంగా ఉంటాయని ఇప్పటికే తేలింది. ఇటువైపు కాస్త చదునుగా.. అటువైపు బిలాలతో నిండి ఉంటుంది. దీనికి కారణం అంతరిక్ష శిలలు ఢీకొనడమేనట. అంతేకాదు.. చంద్రుడి ఉపరితల మందం కూడా రెండు భాగాల్లోనూ భిన్న రీతిలో ఉంటుంది.

Tags:    

Similar News