చినరాజప్ప సీటుకు ఎసరు...అక్కడ ఆయన ముద్ర...!?
అందుకే ఆయనకు చంద్రబాబు తన మంత్రివర్గంలో హోం శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చి గౌరవించారు.
తూర్పు గోదావరిలో మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన వివాదరహితుడు సౌమ్యుడు అని పేరు. అందుకే ఆయనకు చంద్రబాబు తన మంత్రివర్గంలో హోం శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చి గౌరవించారు. ఆయన ఆ పదవిలో ఉన్నా కూడా చంద్రబాబుకు వీర విధేయుడిగా ఉన్నారు.
ఆయన 2014, 2019లలో రెండు సార్లు పెద్దాపురం నుంచి గెలిచారు. ఆయన మరోసారి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకోవాలని చూస్తున్నారు. అయితే ఈసారి ఆయన ఆశలు ఎంతమేరకు నెరవేరుతాయన్నది సందేహంగా ఉందని అంటున్నారు. నిజానికి చూస్తే టీడీపీలో చిన రాజప్పకు పోటీ ఎవరూ లేరు.
ఆయనకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే పొత్తుల వల్లనే ఆయన సీటుకు ఎసరు వస్తుందని అంటున్నారు. అది కూడా ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరిక తరువాతనే అంటున్నారు. ముద్రగడ చూపు పెద్దాపురం మీదనే ఉంది అని అంటున్నారు. పెద్దాపురం నుంచి ముద్రగడ పోటీ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు.
ఆయన కోరుకునే సీటుని కచ్చితంగా టీడీపీ జనసేన కూటమి ఇవ్వాల్సి వస్తుందని అంటున్నారు. ఇక వైసీపీలో ముద్రగడ చేరకపోవడానికి కారణం కూడా సీట్ల దగ్గర వచ్చిన ఇబ్బందే అని కూడా ప్రచారం అయింది. దాంతో ముద్రగడ చేరికకు ముందే ఆయన కండిషన్లు ఉంటాయి కాబట్టి ఆయనకు ఆయన కుమారుడికి ఆయన సన్నిహిత సహచరులకు కోరిన సీట్లు ఇవ్వాలని అంటున్నారు.
దాంతో పెద్దాపురం అసెంబ్లీ సీట్లు ముద్రగడకు ఇస్తారని అంటున్నారు. దాంతో ఇపుడు చినరాజప్పకు ఏమి చేయబోతారు. ఏ రకంగా హామీ ఇస్తారు అన్నది చర్చకు వస్తోంది. అయితే చినరాజప్ప చంద్రబాబుకు వీర విధేయుడుగా ఉంటారు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ కచ్చితంగా ఇస్తారని అంటున్నారు.
అయితే ఇక్కడ మరో చిక్కు ముడి కూడా ఉందని అంటున్నారు. జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ముద్రగడకు కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో అదే పెద్దాపురానికి చెందిన చినరాజప్పకు మంత్రి పదవి కూడా దక్కదేమో అన్న కంగారు అయితే అనుచరులలో ఉందిట. ఏది ఏమైనా నిన్నటిదాకా తన సీటు మీద పూర్తి నిబ్బరంగా ఉన్న చినరాజప్ప ఇపుడు కొంత టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. చూడాలి మరి ఆయన సీటు సేఫ్ అవునో కాదో అన్నది.