కేసీఆర్‌పై చిన్న జీయర్ ప్రశంసల వర్షం.. రగడకు తెరపడినట్టేనా?
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, జీయర్ సంస్థల చైర్మన్ చిన్న జీయర్ స్వామి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ల మధ్య సయోధ్య కుదిరిందా?
దాదాపు ఏడాదిన్నర కాలం పాటు ఉప్పు-నిప్పు మాదిరిగా వ్యవహరించిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, జీయర్ సంస్థల చైర్మన్ చిన్న జీయర్ స్వామి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ల మధ్య సయోధ్య కుదిరిందా? ఇద్దరి మధ్య రగడకు తెరపడిందా? అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా జీయర్ స్వామికి మరోసారి చేరువ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు.
కొన్నాళ్ల కిందటి వాతావరణాన్ని పరిశీలిస్తే.. జీయర్ స్వామి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సమతామూ ర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోడీని పిలిచిన నాటి నుంచి.. సీఎం కేసీఆర్‌కు.. స్వామికి మధ్య విభేదాలు పొడచూపాయి. తర్వాత ఏ కార్యక్రమానికీ జీయర్ స్వామికి ఆహ్వానం అందలేదు. చివరకు జీయర్ స్వామి సూచనలతో చేపట్టిన యాదగిరి పునర్నిర్మాణ కార్యక్రమం అనంతరం నిర్వహించిన మహా కుంభాభిషేకానికి కూడా ఆయనను సీఎం ఆహ్వానించలేదు.
పైగా, జీయర్ స్వామికి వ్యతిరేకంగా.. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను తెరమీదికి తెచ్చారు. ఈ పరిణా మం తీవ్ర రగడకు దారి తీసింది. అంతేకాదు, జీయర్ స్వామి మేనల్లుడు.. గురించి కూడా ఓ వర్గం మీడి యా కథనాలు ప్రచారం చేసి.. జీయర్ కు సెగ పుట్టించేలా వ్యవహరించారు. ఈ పరిణామాలతో ఇక, జీయర్‌కు , కేసీఆర్‌కు మధ్య భారీ గ్యాప్ పెరిగిపోయిందని అందరూ అనుకున్నారు. ఎడమొహం పెడమొహమే కాకుండా.. ఒకరకంగా మాటల యుద్ధాలు కూడా సాగాయి.
అలాంటి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కీలకమైన ఎన్నికల సమయం కావడంతో బహుశ కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా జీయర్ స్వామిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్టు స్పష్టంగా కనిపించింది. ``తెలంగాణలో పాలకులందరికీ దైవభక్తి ఎక్కువ. అందుకే రాష్ట్రం సుభిక్షంగా ఉంది`` అంటూ.. సీఎం కేసీఆర్‌పై చినజీయర్ స్వామి పరోక్షంగా ప్రశంసల జల్లు కురిపించారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గుట్టపై రామాలయం పునఃప్రతిష్ఠాపన మహోత్సవం వైభవం గా జరిగింది. ఈ ఆలయాన్ని రూ.25 కోట్లతో ప్రభుత్వం పునర్నిర్మించింది. చినజీయర్‌స్వామికి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు స్వాగతం పలికగా, మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. మొత్తంగా ఈ పరిణామాన్ని గమనిస్తే.. ఎన్నికలకు ముందు స్వామిని ప్రసన్నం చేసుకోవడంలో సీఎం కేసీఆర్ సక్సెస్ అయ్యారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.