రాజ్యసభకు చిరంజీవి...బీజేపీ బంపర్ ఆఫర్...!?
తెలంగాణా ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ సీట్లు తెచ్చుకున్న బీజేపీ ఈసారి అదే నంబర్ తో ఎంపీలను సాధించాలని చూస్తోంది.
మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ వదిలేలా కనిపించడంలేదు. ఏపీతో పాటు తెలంగాణాలో బీజేపీ ఈసారి తన సత్తా చాటాలని చూస్తోంది. తెలంగాణా ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ సీట్లు తెచ్చుకున్న బీజేపీ ఈసారి అదే నంబర్ తో ఎంపీలను సాధించాలని చూస్తోంది.
అదే విధంగా ఏపీలో కూడా జనసేనతో కలసి కూటమిగా ఏర్పడి ఏపీ రాజకీయాల్లో బలంగా మారాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో పవన్ ని తమతో పాటు ఉంచుకుంటూనే మెగాస్టార్ చిరంజీవిని కూడా తిప్పుకోవాలని అంటోంది. రాజకీయాలకు నేను దూరం అని చిరంజీవి అంటున్నా కూడా బీజేపీ అయితే ఎక్కడా తగ్గడంలేదు.
ఇటీవల గణతంత్ర దినోత్సవ వేళ ప్రకటించిన పౌర పురస్కరాలలో దేశంలోనే అత్యున్నత రెండవ పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ మెగాస్టార్ ని వరించింది. ఆ అవార్డు ఆయనకు దక్కడం అన్నది ఈ సందర్భంలో కావడమే చర్చకు తావిసోంది.
నిజానికి ఇలాంటి అవార్డులకు చిరంజీవి అర్హుడే. కానీ ఎన్నికలు ముంగిట పెట్టుకుని మరీ చిరంజీవికి ఇంతటి అవార్డు ఇవ్వడం అంటే కచ్చితంగా బీజేపీ ఆలోచనలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఇది చాలదు అన్నట్లుగా బీజేపీ మరో ఆలోచన చేస్తోంది అని ప్రచారం సాగుతోంది.
రాజ్యసభ ఎన్నికలు ఈ మార్చిలో జరగనున్నాయి. వీటితో పాటే రాష్ట్రపతి నామినేట్ చేసే రాజ్య సభ ఎంపీలను భర్తి చేయాల్సి ఉంది. అధికార బీజేపీకే ఈ చాన్స్ ఉంది. దాంతో ఈ కోటాలో మెగాస్టార్ చిరంజీవికి ఒక అవకాశం ఇస్తారని అంటున్నారు. ఈ నామినేటెడ్ పదవి అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. అందువల్ల మెగాస్టార్ తప్పకుండా ఒప్పుకుంటారు అని బీజేపీ భావిసోంది.
అందువల్ల ఈ పదవిని ఆయనకు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది అని అంటున్నారు. అదే విధంగా చిరంజీవిని మెల్లగా తమతో తిప్పుకుని ఏపీలో బీజేపీ పాలిటిక్స్ చేయాలని చూస్తోంది అని అంటున్నారు. రామాలయం ప్రారంభం తరువాత బీజేపీకి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అనుకూలత పెరిగింది.
దాంతో పాటు ఏపీలో సామాజిక సమీకరణలను కూడా సరిచూసుకుని బీజేపీ ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగుతుంది అని అంటున్నారు. తెలంగాణాలో బీసీ సీఎం అని చెప్పి ఓట్ల శాతం గణనీయంగా పెంచుకున్న బీజేపీ ఏపీలో కాపు కార్డుతో ముందుకు వెళ్లాలని చూస్తోంది. జనాలలో విశేష అభిమానం ఉన్న మెగాస్టార్ ని తమ ఎంపీగా చేసుకుని ఏపీలో ఎన్నికలలో సంచలనాలను నమోదు చేయాలన్నది బీజేపీ జెండాగా ఉంది అని అంటున్నారు.
ఇక జనసేన అయితే టీడీపీతో కలసి ఎన్నికలలు వెళ్దామని చెబుతోంది. కానీ బీజేపీ మాత్రం ఏపీలో ఎదగడానికి తమకంటూ ఒక సొంత బలాన్ని పెంచుకోవడానికి 2024 ఎన్నికలను ఒక సాధనంగా మార్చుకుంటోంది అని అంటున్నారు. ఇంతకీ మెగాస్టార్ ఏమంటారు అన్నది చూడాలి.ఇక చూస్తే గతంలో చిరంజీవి రాజ్యసభ మెంబర్ గా కాంగ్రెస్ తరఫున నెగ్గి కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. మరి ఈసారి ఎంపీ అయితే ఆయన కూడా కేంద్రంలో బీజేపీలో మంత్రి అయ్యే చాన్స్ కూడా ఉంది అని అంటున్నారు.