చిరంజీవి తరుపున నిలబడ్డ ఉండవల్లి...ఆయన పిచ్చుక కాదు!
రెండు రోజులుగా ఏపీలో చిరంజీవి చేసిన కామెంట్ల చుట్టూ రాజకీయం నడుస్తోన్న సంగతి తెలిసిందే.
రెండు రోజులుగా ఏపీలో చిరంజీవి చేసిన కామెంట్ల చుట్టూ రాజకీయం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... చిరంజీవి ఏపీ ప్రభుత్వ పెద్దలకు సలహాలూ సూచనలు ఇచ్చారు. మరో పక్క ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చిరుకి లెఫ్టూ రైటూ ఇస్తున్నంత పనిచేస్తున్నారు. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ తెరపైకి వచ్చారు.
అవును... ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చిరంజీవి వర్సెస్ వైసీపీ సర్కార్ అన్నట్లుగా సాగుతుందంటూ కథనాలొస్తోన్న ఇష్యూపై తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా చిరంజీవికి అనుకూలంగా స్పందించారు. చిరంజీవి పిచ్చుక కాదని తెలిపారు. దీంతో ఉండవల్లి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నేరుగా మద్దతు ఇచ్చినట్లు కనిపించనప్పటికీ... ఆయన శ్రేయోభిలాషిగా ఉండవల్లి అరుణ్ కుమార్ ముద్రపడ్డారని అంటుంటారు. తనకు ఎంతో ఇష్టమైన దివంగత వైఎస్సార్ కుమారుడిగా జగన్ ను అభిమానిస్తానని పలు సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. మరోపక్క మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ అక్రమాలపై న్యాయ పోరాటం చేస్తున్నారు.
ఈ సమయంలో తాజాగా చిరంజీవి కామెంట్స్ వివాదాస్పదం అయిన నేపథ్యంలో.. ఆయనకు అనుకూలంగా ఉండవల్లి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. కారణం... ప్రత్యేక హోదాపై పోరాడాలని వైసీపీ ప్రభుత్వానికి చిరంజీవి సలహా ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
ఇదే క్రమంలో... రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర మంత్రిగా చిరంజీవి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడ్డం ఆషామాషీ కాదని అన్నారు. ఇక, నాడు పార్లమెంట్ లో చిరంజీవి మాట్లాడ్డం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయ్యిందంటూ ఉండవల్లి సంచలనాత్మక స్టేట్ మెంట్ ఇచ్చారు.
అయితే చిరంజీవి సినిమా పరిశ్రమను పిచ్చుకగా అభివర్ణించడం సరైందే కానీ.. ఆయన మాత్రం కాదని ఉండవల్లి కీలక కామెంట్స్ చేశారు. దీంతో... ఉండవల్లి కామెంట్స్ పై చిరు, పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా... వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.