అందుకే రాజకీయాల నుంచి తప్పుకున్నా: చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శల వల్లే తాను రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ పురస్కారం పొందిన ప్రముఖ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పద్మశ్రీ అవార్డులు పొందిన దాసరి కొండప్ప, ఆనందాచారి, కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమాలాల్, ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్యలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతులను అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పద్మ పురస్కారాలు పొందినవారిని సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు హుందాగా ఉండాలన్నారు. వ్యక్తిగత విమర్శలు తగవన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శల వల్లే తాను రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లను తిప్పికొట్టగలిగితేనే రాజకీయాల్లో కొనసాగవచ్చేనే పరిస్థితి నేడు ఉందని చిరు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో వెంకయ్య నాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడని చిరంజీవి కొనియాడారు. మాజీ ప్రధాని వాజపేయిలో ఉన్నంత హుందాతనం ఆయనలో ఉందన్నారు. వెంకయ్య వాగ్ధాటికి తాను పెద్ద అభిమానినని వెల్లడించారు. చిన్నతనం నుంచి ఆయన తనకు స్ఫూర్తి అని తెలిపారు. రాజకీయాల్లో రానురాను దుర్భాషలు ఎక్కువైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నోరుజారి వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్లకి బుద్ధి చెప్పే శక్తి ప్రజలకే ఉందని చిరు హాట్ కామెంట్స్ చేశారు.
కాగా నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్ పేరు పెట్టాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సముచితమైందని చిరంజీవి కొనియాడారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
పద్మవిభూషణ్ పురస్కారం వచ్చాక వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తుంటే చాలా ఆనందంగా ఉందని చిరంజీవి వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ మనసారా ఆశీర్వదిస్తుంటే ఈ జన్మకిది చాలు అనిపిస్తోందన్నారు. తన తల్లిదండ్రుల పుణ్యఫలం తనకు సంక్రమించిందని ఆనందం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించాలనే ఆలోచన చేయడం బహుశా ఇదే మొదటిసారని తెలిపారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో కళలు, కళాకారులకు ప్రోత్సాహం అందించినట్లవుతుందన్నారు.
నంది అవార్డులు గత చరిత్రలా అయిపోయాయని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని త్వరలో ఇస్తామని సీఎం ప్రకటించడం ఆనందదాయకమన్నారు. ఆ అవార్డులకు గద్దర్ పేరు పెట్టాలనే నిర్ణయం ఎంతో సంతోషకరమన్నారు.
అయితే తనకు పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం పద్మవిభూషణ్ వచ్చినందుకు లేదన్నారు. నేడు తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయని సంతోషం వ్యక్తం చేశారు. పద్మశ్రీ అవార్డులు ప్రకటించాక చాలాసేపటికి పద్మవిభూషణ్ ప్రకటించడం వెనుక ప్రధాని మోదీ వ్యూహం ఉందన్నారు. ముందుగా పద్మశ్రీ అవార్డులు బడుగు బలహీన వర్గాల ఇవ్వాలని చెప్పిన ఆలోచన మోదీదేనన్నారు. దీన్ని ఎవరైనా అభినందించాల్సిందేనని కొనియాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తనకు అత్యంత గౌరవం ఉందని చిరంజీవి తెలిపారు. కళను గుర్తించి అవార్డులు ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు.
థియేటర్లు, పాలాభిషేకాలు అంటూ అభిమానులు తమ సమయాన్ని వృథా చేయకూడదనే బ్లడ్ బ్యాంక్ స్థాపించానన్నారు. ఫ్యాన్స్ ప్రాణం ఇస్తామంటారని.. కానీ వారి ప్రాణం వద్దని.. రక్తం ఇవ్వండి అనే నినాదంతో బ్లడ్ బ్యాంకు ప్రారంభించానన్నారు. ఈ ఉత్సాహం జీవనదిలా కొనసాగుతోందన్నారు. ప్రతి వేడుకలో రక్తదానం చేయడానికి ప్రజలు ముందుకొస్తున్నారని తెలిపారు. దీనికి నడుం బిగించింది తాను, తన అభిమానులే అని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు.