అమెరికాని వణికిస్తున్న సికాడాలు...రెండు శతాబ్ధాల తర్వాత ఫస్ట్ టైం!
భూమిలో పెరిగే ఈ పురుగుల్లో... సికాడా బ్రూడ్ - 19, సికాడా బ్రూడ్ - 13 అనే రెండు రకాల గ్రూపులు ఉంటాయి
సూర్య నటించిన బందోబస్తు సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో భారత్ లోని పంటలను నాశనం చేయడం కోసం పురుగులను ప్రయోగిస్తారు. అవి గుంపులుగా పంటలపై దాడి చేసి.. కోతకొచ్చిన పంటలను నాశనం చేస్తుంటాయి. దాదాపు ఇలాంటి సమస్యే ఇప్పుడు అమెరికా ఎదుర్కోబోతోంది. ఆ సమస్య పేరు సికాడా! ఇవి ఓ విశిష్ట లక్షణాలు కలిగిన జీవరాశులు!
అవును... అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ఈ సికాడాలను తలచుకుని వణికిపోతుందని చెప్పినా అతిశయోక్తి కాదు! సికాడా అనేది కీటకాల సూపర్ ఫ్యామిలీ. ఇది ఆకులను తినే జాతి కీటకం. సాధారణంగా మిడతల ఆకారంలో ఉండే ఈ సికాడాలు మానవులకు హానికరం కావు కానీ.. చెట్ల ఆకులను, రసాలను పీల్చుతాయి. వ్యవసాయానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.
భూమిలో పెరిగే ఈ పురుగుల్లో... సికాడా బ్రూడ్ - 19, సికాడా బ్రూడ్ - 13 అనే రెండు రకాల గ్రూపులు ఉంటాయి. వాస్తవానికి వీటిలో బ్రూడ్ - 19 ప్రతీ 13ఏళ్లకు.. బ్రూడ్ - 13 ప్రతీ 17 ఏళ్లకూ బయటకు వస్తుంటాయి. అయితే ఈసారి రెండూ కలిపి ఒకేసారి వస్తాయని అంటున్నారు. ఇలాంటి అరుదైన వింత సుమారు 221 ఏళ్ల తర్వాత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ క్రమంలో ఇవి ఈ ఏడాది అమెరికాలోని సుమారు 18 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తాయని.. ఫలితంగా సుమారు 15 రాష్ట్రాలపై ఇవి ప్రభావం చూపుతాయని అంటున్నారు. సికాడా బ్రూడ్ - 19 చివరిసారిగా 2011లో ప్రయాణించాయని సికాడా మానియా అనే కీటకాల వెబ్ సైట్ పేర్కొంది. ఇవి మే మధ్యలో ప్రారంభమై జూన్ చివరిలో ముగుస్తాయని.. భూమిలో 8 అంగుళాల నేలలో, 64 డిగ్రీల ఫారెన్ హీట్ వాతావరణ పరిస్థితుల్లో బతుకుతుంటాయని చెబుతున్నారు.
ఇదే సమయంలో సికాడా బ్రూడ్-13 చివరిసారిగా 2007లో వచ్చాయని అంటున్నారు. సాధారణంగా ప్రతీ 17 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇవి దర్శనమిస్తాయని చెబుతున్నారు. ఇవి ఈ దఫా సుమారు ఐదు రాష్ట్రాలను ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా... అయోవా, విస్కాన్సిన్, ఇల్లినాయిస్, ఇండియానా, మిచిగాన్ రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయని అంచనా వేస్తున్నారు.
అసలు ఇవి ఎందుకు బయటకు వస్తాయి?:
భూమిలోని చెట్ల వేర్ల రసాలను పీల్చుతూ ఆహారాన్ని సమకూర్చుకునే ఈ సికాడాలు... నేలలో బొరియలు చేసుకుంటూ నిద్రాణ స్థితిలో జీవనం సాగిస్తాయి. ఈ సమయంలో ఇవి యవ్వన దశకు రాగానే భూమి నుంచి బయటకు వస్తాయి. ఇందులో భాగంగా... మిడతల దండు మాదిరిగానే లక్షల సంఖ్యలో మగ సికాడాలు, ఆడ సికాడాలు కలిసి డిఫరెంట్ సౌండ్స్ చేసుకుంటూ ప్రయాణం చేస్తాయి.
ఆ సమయంలోనే ఇవి సంభోగం జరుపుకుంటాయని.. అనంతరం ఆడ సికాడాలు తమ గుడ్లను చెట్ల బెరడుల్లో గుంతలు చేసి భద్రపరిచి వెళ్లిపోతాయని చెబుతున్నారు. అంతటితో వాటి జవన చక్రం ముగుస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది మేలో ఇవి బయటకు వస్తాయని అంటున్నారు పరిశోధకులు!