కేఏ పాల్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ఈవీఎంలపై సంచలన తీర్పు!
కానీ, భారత దేశంలో మాత్రం ఈవీఎంలను వినియోగిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పాల్ అనేక విషయాలను సుప్రీంకోర్టుకు తెలిపారు.
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కిలారి ఆనంద పాల్(ఏకే పాల్)పై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ``ప్రపంచ దేశాల్లో తిరిగానని చెబుతున్నారు. ప్రపంచానికి బోధించానని చెబుతున్నారు. మరి ప్రపంచంలో జరుగుతున్న మార్పులను ఎందుకు స్వీకరించరు? ఎందుకు విభేదిస్తున్నారు? ప్రపంచ దేశాలకు భిన్నంగా భారత్ ముందుకు సాగుతుంటే ఎందుకు వద్దంటున్నారు?`` అని ప్రశ్నల వర్షం కురిపించింది. దీంతో ఖంగుతిన్న పాల్.. అక్కడితో తన వాదనలను కట్టిబెట్టారు. అనంతరం సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.
ఏం జరిగింది?
దేశంలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల ద్వారానే జరిగింది. అయితే .. దీనిని వ్యతిరేకిస్తూ.. పాల్ సుప్రీం కోర్టులో పలు పిటిషన్‌లు వేశారు. ఈవీఎంలు అవినీతికి కారణంగా మారుతున్నాయని, ఓట్లు ఓకరికి వేస్తే.. మరొకరికి పడుతున్నాయని.. ప్రపంచ దేశాలు చాలా వరకు ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ వైపే మొగ్గు చూపుతున్నాయని పాల్ స్వయంగా వాదనలు వినిపించారు. అంతేకాదు.. ఈ నెలలో ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యవహారాన్ని కూడా పాల్ సుప్రీంకోర్టుకు వివరించారు. అక్కడ కూడా బ్యాలెట్ ఓటింగ్ విధానమే నడిచిందన్నారు.
కానీ, భారత దేశంలో మాత్రం ఈవీఎంలను వినియోగిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పాల్ అనేక విషయాలను సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆధారాలు కూడా చూపించారు. ``ఎన్నికల పోలింగ్‌కు-ఓట్ల లెక్కింపునకు మధ్య నెల రోజుల గడువు ఉంది. కానీ, ఈవీఎంల బ్యాటరీల సామర్థ్యం ఒక్కొక్క చోట 90 శాతం ఉంటోంది. మరికొన్ని చోట్ల 60 శాతం ఉంటోంది. ఇది అవినీతే``నని పేర్కొన్నారు. అదేవిధంగా వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించడం లేదన్నారు. ఇక, పోలింగ్ అయిన ఓట్ల సంఖ్యకు కౌంటింగ్ అయిన ఓట్ల సంఖ్యకు మధ్య కూడా వ్యత్యాసం భారీగా ఉంటోదని తెలిపారు.
ఇవన్నీ గమనిస్తే.. ఈవీఎంల ద్వారా ఓటింగ్ ప్రక్రియ సరికాదన్న అభిప్రాయాన్ని పాల్ నొక్కి చెప్పారు. అయితే.. ఈ వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, పీబీ వరలేతో కూడిన ధర్మాసనం పలు ప్రశ్నలతో పాల్‌ను గట్టిగానే నిలదీసింది. 'మీరు గెలిస్తే ఈవీఎంలు మంచివి, ఈవీఎంలు ట్యాంపర్ కాలేదని అంటారు. ఓడిపోతే మాత్రం ఈవీఎంల ట్యాపరింగ్ జరిగిందని అంటారు'' అని వ్యాఖ్యానించింది. ప్రపంచ దేశాల్లో బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరిగితే .. భారత్‌లో దానికి భిన్నంగా ఎందుకు జరగకూడదని నిలదీసింది. బ్యాలెట్ విధానాన్ని అనుసరించినంత మాత్రాన అవినీతి ఆగిపోతుందని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఈవీఎంల ఎన్నిక విధానమే సరైందని సంచలన తీర్పు ఇచ్చింది.