చెన్నై సింగర్ తో దేశంలోనే పిన్న ఎంపీ పెళ్లి ఖరారు
కర్ణాటకకు చెందిన ఈ బీజేపీ ఎంపీ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. తన పెళ్లికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
తేజస్వీ సూర్య పేరు విన్నంతనే ఎక్కడో విన్నట్లుగా అనిపించటం ఖాయం. దేశంలోనే అత్యంత పిన్న వయసులో ఎంపీగా గెలిచిన అన్న రిఫెరెన్సు వచ్చేస్తే.. ఇట్టే గుర్తుకు వచ్చేస్తారు. కర్ణాటకకు చెందిన ఈ బీజేపీ ఎంపీ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. తన పెళ్లికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ యువ ఎంపీ పెళ్లి చేసుకోనున్నది ఎవరినో కాదు.. చెన్నైకు చెందిన ఒక క్లాసికల్ సింగర్ శివశ్రీ స్కందను. త్వరలోనే వీరి పెళ్లి జరగనున్నట్లుగా వార్తలు రావటంతో పాటు.. వీరి పెళ్లికి బెంగళూరు వేదిక కానున్నట్లుగా తెలుస్తోంది
లాయర్ అయిన తేజస్వి సూర్య బీజేపీ ఎంపీగా బెంగళూరు సౌత్ నుంచి ఎన్నిక కావటం తెలిసిందే. 2019లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్ పై 3.31 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దేశంలోనే పిన్న వయసులో ఎంపీగా ఎన్నికైన నేతగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2019లోజరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాదు.. 2020 సెప్టెంబరు నుంచి భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2024లో ఐరన్ మ్యాన్ 70.3 ఎండ్యూరెన్స్ రేసును ఈ యువ ఎంపీ విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ కఠిన రేసును పూర్తి చేసిన సిట్టింగ్ ఎంపీగా ఆయన నిలిచారు. ఈ ఏడాది మరింత దూరాన్ని అధిగమించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇక.. గాయని శివశ్రీ స్కంద విషయానికి వస్తే బయో ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయటమే కాదు.. చెన్నై వర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ కోర్సు పూర్తి చేశారు. పొన్నియిన్ సెల్వన్ పార్టు 2లో కన్నడ వెర్షన్ కు ఒక పాట పాడారు. ఆమెకు 2 లక్షల మంది సబ్ స్క్రైబర్లతో యూట్యూబ్ చానల్ కూడా ఉంది.
కన్నడలో శివశ్రీ స్కంద ప్రసాద్ పాడిన పాటలు శ్రీరాముడి పట్ల ఆమెకున్న భక్తిభావాన్ని తెలియజేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రశంసించటంతో ఆమె.. మరింత పాపులర్ అయ్యారు. ఆమె గురించి సోషల్ మీడియాలోనూ పోస్టు చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి వివాహం మార్చి 24న జరగనుంది. ఈ విషయాన్ని ఎంపీ తేజస్వి బెంగళూరులో స్వయంగా ప్రకటించారు.