మద్యం మత్తులో సీఐ ఘోరం!
మద్యం తాగి డ్రైవ్ చేయొద్దు అని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు నెత్తీనోరు బాదుకుని చెబుతూనే ఉన్నారు
చట్టాలను ముందుగా పాటించాల్సినవారే దారి తప్పుతున్నారు. తాము చట్టాలను పాటిస్తూ ప్రజలను కూడా వాటిని అనుసరించేలా చూడాల్సిన కొందరు పోలీసులు తమ బాధ్యతలు మరిచి పోలీసు వృత్తికే కళంకం తెస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో తరచూ సస్పెండ్ అవుతున్నా, ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నా కొంతమంది మారడం లేదు. తాజాగా హైదరాబాద్ లో ఒక సీఐ ఉదంతం ఇలాగే కలకలం రేపింది.
మద్యం తాగి డ్రైవ్ చేయొద్దు అని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు నెత్తీనోరు బాదుకుని చెబుతూనే ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున నిత్యం డ్రంకన్ డ్రైవ్ కేసులు రోజూ నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనలను పాటించాల్సిన పోలీసే దారి తప్పాడు.
హైదరాబాద్ లో ఒక సీఐ మద్యం తాగి కారు నడిపాడు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ఎదురుగా వస్తున్న వాహనాలన్నింటినీ ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒక కూరగాయల వాహన డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరం బొల్లారం పోలీసు స్టేషన్ పరిధిలో సీఐ శ్రీనివాస్ ఫుల్లుగా మద్యం సేవించి అతివేగంతో కారును పోనిచ్చాడు. ఈ క్రమంలో ఎదురుగా కూరగాయల లోడుతో వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో, కూరగాయల వాహనం నడుపుతున్న శ్రీధర్.. వాహనం ముందు భాగంలో ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సీఐ శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, సీఐ శ్రీనివాస్ ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విధులు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆయన వాహనంపై ఆరు ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఉన్నాయని చెబుతున్నారు, సీఐ శ్రీనివాస్ మద్యం సేవించి కారు నడపటంతో ఆయనకు పోలీసులు డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో డ్రంకన్ అండ్ డ్రైవ్ టెస్టులో సీఐ శ్రీనివాస్ రీడింగ్ 200 దాటినట్టు తెలుస్తోంది.