బంగ్లాదేశ్ లో హిందువులకు సైన్యానికి మధ్య ఘర్షణ

రిజర్వేషన్ల అంశం ముదిరిపోయి ఆవేశానికి గురైన యువత ఆగ్రహంతో షేక్ హసీనాను గద్దె దిగాల్సి రావటం.

Update: 2024-08-14 05:04 GMT

కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. రిజర్వేషన్ల అంశం ముదిరిపోయి ఆవేశానికి గురైన యువత ఆగ్రహంతో షేక్ హసీనాను గద్దె దిగాల్సి రావటం.. ఆమె భారత్ కు వచ్చేసి తలదాచుకోవటం లాంటి పరిణామాలు ఒకవైపు.. మరోవైపు బంగ్లాదేశ్ లోమైనార్టీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్న దాడులు.. కనిపించకుండా పోతున్న వారి సంఖ్య పెరుగుతున్న వైనంపై రగిలిపోతున్న బంగ్లాదేశ్ హిందువులు ఇప్పుడు సైన్యాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

తమవాళ్లు ఎక్కడ? అన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి. మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హింసాత్మక ఘటనల్లో హిందువులపై దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులు ఎక్కడ? వారి ఆచూకీ మాటేమిటి? అని ప్రశ్నిస్తూ హిందువులు పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకొని నిరసనకు దిగారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న ముహమ్మద్ యూనస్ బస చేసిన గెస్టు హౌస్ వద్ద నిరసనకు దిగారు.

వీరిని నిలువరించేందుకు సైన్యం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో హిందూ ఆందోళనకారులకు.. సైన్యానికి మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం తమపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ లక్షలాది మంది రోడ్ల మీదకు వచ్చిన హిందువులు ఒక్కసారిగా రోడ్ల మీదకు రావటంతో సంచలనంగా మారింది. బంగ్లాదేశ్ చరిత్రలో ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని చెబుతున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో పాటు చిట్టగాంగ్ లోనూ లక్షలాది మంది హిందువులు ర్యాలీ చేశారు. మరోవైపు వేలాది మంది హిందువులు తమపై జరుగుతున్న దాడుల్ని తట్టుకోలేక బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి చేరుకొని భారత్ కు వచ్చే ప్రయత్నం చేస్తుండటం తెలిసిందే. పార్లమెంట్ లో పది శాతం సీట్లను మైనార్టీలైన హిందువులకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. హిందువులకు మద్దతుగా వేలాది మంది ముస్లింలు సైతం ర్యాలీలో పాల్గొనటం.. తమ సంఘీభావాన్ని తెలపటం గమనార్హం. ప్రముఖ మీడియా సంస్థల అంచనాల ప్రకారం ఈ భారీ నిరసన ర్యాలీలో ఏడు లక్షలకు పైగా పాల్గొన్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేతగా వ్యవహరిస్తున్న ముహమ్మద్ యూనస్ ఢాకాలోని ప్రఖ్యాత ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. మైనార్టీలైన హిందువులకు సంఘీభావం తెలిపే ప్రయత్నంలో ఆయనిలా చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి హక్కుల పరిరక్షణకు పాటుపడతామన్న భరోసాను ఇచ్చారు. మైనార్టీ.. మెజార్టీ అన్న ప్రస్తావన లేకుండా అందరూఐక్యంగా.. సంయమనాన్ని పాటించాలని ఆయన కోరుతున్నారు. భారీగా తమపై జరిగిన దాడులు.. ఆస్తుల ధ్వంసంపై బంగ్లాదేశ్ హిందువులు దారుణ పరిస్థితుల్లో ఉన్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News