పెళ్లికి గడ్డం అడ్డం వచ్చిన వేళ... ఇష్యూ సీరియాస్!

అయితే... ఈ విషయంపై పెళ్లి కుమారుడి తండ్రి ఫైరయ్యారు. క్లీన్ షేవ్ చేసుకోకుండా పెళ్లి పీటలెక్కేది లేదని కరాకండీగా చెప్పారు.

Update: 2023-08-22 12:00 GMT

సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే.. మరికొన్ని సంఘటనలు ఈ ప్రపంచంలో టూమచ్ డిఫరెంట్ మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉన్నారనే విషయాన్ని మరింత బలపరుస్తుంటాయి! ఇందులో భాగంగా తాజాగా కోయంబత్తురూలో జరిగిన ఒక సంఘటన... ఇది పీక్స్ గురూ... అనిపించేలా ఉంది! ఈ కథంతా గడ్డం చుట్టూనే తిరగడం గమనార్హం!

అవును... కోయంబత్తూరు నగరం పరిధిలోని సూలూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త తన కుమారుడికి మూడు నెలల క్రితం పొల్లాచ్చి ప్రాంతానికి చెందిన యువతితో నిశ్చితార్థం చేశాడు. అనంతరం తాజాగా పెళ్లి ఫిక్స్ చేశారు. దీంతో ఇరు వర్గాల కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాయి.

పెద్దలు వారి పనుల్లో వారు బిజీగా ఉంటే... ఎంగేజ్మెంట్ అయినప్పటినుంచీ పెళ్లికొడుకు, పెళ్లి కూతురు మాత్రం ఫోన్స్ లో ఫుల్ బిజీ అయిపోయారు. నిత్యం మాట్లాడుకుంటూ.. ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకున్నారు. ఈ గ్యాప్ లో పెళ్లి సమయం రానేవచ్చింది. దీంతో... పెళ్లికి ముందు నీట్ గా షేవ్ చేసుకుని రెడీ అవ్వమని తండ్రి.. పెళ్లి కొడుకుని పార్లర్ కు పంపించాడు.

తండ్రి చెప్పినట్లుగానే పార్లర్ కి వెళ్లిన కుమారుడు... క్లీన్ షేవ్ కాకుండా ట్రిం చేయించుకుని వచ్చాడు! అయితే... ఈ విషయంపై పెళ్లి కుమారుడి తండ్రి ఫైరయ్యారు. క్లీన్ షేవ్ చేసుకోకుండా పెళ్లి పీటలెక్కేది లేదని కరాకండీగా చెప్పారు. అయితే... తనకు కాబోయే భార్య ట్రిం గా ఉంచుకోమంది పెళ్లి కొడుకు... తన తండ్రికి కారణం చెప్పుకొచ్చాడు.

దీంతో మరింత ఫైర్ అయిన తండ్రి... ఇంకా పెళ్లి కాకముందే తన మాటకు విలువ ఇవ్వడం లేదా అని ఫైరయ్యాడు. ఆగ్రహం పీక్స్ కి వెళ్లడంతో... ఈ రోజు జరగాల్సిన మా అబ్బాయి పెళ్లి వాయిదా వేయడం జరిగింది అని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.

ఈ విషయం పెళ్లి కుమార్తె వారికి తెలియడంతో... హుటా హుటున బయలుదేరి వచ్చారు. ఏమి జరిగిందనే విషయాన్ని తెలుసుకున్నారు. పెళ్లి కుమారుడి తండ్రికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తాను చెప్పినట్టుగా గడ్డం తొలగించకుండా వధువు చెప్పినట్టుగా ట్రిం చేసుకొచ్చిన తనయుడు పరిస్థితిని వారికి వివరించాడు.

దీంతో పరిస్థితి అర్ధం చేసుకున్న బంధువులు, వధువు కుటుంబం... పెళ్లి కొడుకు తండ్రిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎవరు ఎంత బుజ్జగించినా ఆ తండ్రి ఏమాత్రం తగ్గక పోవడం ఈ రోజు ఉదయం జరగాల్సిన వివాహం ఆగిపోయింది.

అయితే జరిగిన విషయంపై స్పందించిన పెళ్లి కొడుకు తండ్రి... తన కంపెనీలోని కార్మికులే గడ్డం పెంచితే తాను ఒప్పుకోనని.. అలాంటిది తన సొంత కొడుకే ఈ నియమాన్ని ఉల్లగించడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో... విషయం స్థానికంగా వైరల్ అవ్వడంతో... సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది!

Tags:    

Similar News