రాహుల్ తో అగాధమా? కొట్టిపారేసిన రేవంత్.. ఏం చెప్పారంటే?
తాజాగా ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా రేవంత్ ఈ అంశంపై స్పందించారు.
గడిచిన కొద్ది రోజులుగా ఒక మాట తెలంగాణ రాజకీయ వర్గాల్లో తరచూ చర్చకు వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ సానుకూలంగా లేరని.. ఆయనపై గుర్రుగా ఉన్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిలకు తరచూ అపాయింట్ మెంట్ ఇస్తున్న రాహుల్.. రేవంత్ రెడ్డిని మాత్రం దగ్గరకు రానివ్వటం లేదన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. అయితే.. ఈ అంశాల్ని సీఎం రేవంత్ వద్ద ఇప్పటివరకు ఎవరూ ప్రస్తావించింది లేదు. దీనికి తగ్గట్లే.. ఆయన ఈ విమర్శలకు సమాధానం ఇచ్చింది లేదు.
తాజాగా ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా రేవంత్ ఈ అంశంపై స్పందించారు. తనకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని.. ఆయన తనకు అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదన్న వాదనలోనూ నిజం లేదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ సభలో తాను మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడారని.. తెలంగాణ ముఖ్యమంత్రి బాగా పని చేస్తున్న విషయాన్ని గుర్తు చేయటం గమనార్హం.
తెలంగాణలో కులగణన గురించి పార్లమెంటులో ప్రస్తావించారని.. బిహార్ లో కూడా తన గురించి మాట్లాడిన విషయాల్ని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. కులగణనపై రాహుల్ తో ఎప్పటికపపుడు చర్చించానని.. కాంగ్రెస్ అధినాయకత్వం ఆమోదం లేకుండా కులగణనను జరిపించి అసెంబ్లీలో ప్రవేశ పెడతామా? అంటూ ప్రశ్నించటం ద్వారా.. అధిష్ఠానం తన వెంట ఉన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి.
రాహుల్ తో తనకున్న సన్నిహిత సంబంధాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదని.. గతంలో చంద్రబాబుతో పని చేసినప్పుడు కూడా ఆయన తనపై అగ్రహంతో ఉన్నారని ప్రచారం చేసిన వైనాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కొందరు తనపై తిరుగుబాటు చేస్తున్నారన్న కథనాల్లోనూ నిజం లేదన్నారు. ‘‘వారు సరదాగా కూర్చొని పార్టీ చేసుకుంటే చిలువలు పలవలు అల్లి ప్రచారం చేశారు. అనిరుధ్ రెడ్డి పిలిస్తే పది మంది ఎమ్మెల్యేలు వెళతారా?’’ అంటూ నవ్వుతూ పశ్నించారు.
నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి మహబూబ్ నగర్ కు నీటి కోసం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడేందుకు జూపల్లి క్రిష్ణారావును లెటర్ ఇచ్చి తానే బెంగళూరు పంపానని చెప్పిన రేవంత్ రెడ్డి.. తన ఢిల్లీ పర్యటనలో ఈసారి కులగణనపై.. పీసీసీ కార్యవర్గం మీదనే చర్చలు జరిగినట్లు చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మంత్రివర్గంలోకి తీసుకోవాలని తాను ఎవరి పేర్లను సిఫార్సు చేయలేదని వెల్లడించటం గమనార్హం.