నా నోట్లో నుంచి అబద్ధాలు రావు!

ఒక్క అబద్ధమాడితే 2014లోనే సీఎం అయ్యేవాడినని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో తమకు 45 శాతం ఓట్లు వస్తే టీడీపీకి దాదాపు ఒక్క శాతం ఓట్లు అధికంగా రావడంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు.

Update: 2024-02-07 09:54 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో మరో రెండు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 2024–25కు మధ్యంతర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టేందుకు ఏపీ శాసనసభ సమావేశమైంది. ఈ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒక్క అబద్ధమాడితే 2014లోనే సీఎం అయ్యేవాడినని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో తమకు 45 శాతం ఓట్లు వస్తే టీడీపీకి దాదాపు ఒక్క శాతం ఓట్లు అధికంగా రావడంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. తమకు, చంద్రబాబుకు తేడా ఒక్క శాతం మాత్రమేనని గుర్తు చేశారు. నాడు తాము కూడా రూ.87 వేల కోట్లు రైతుల రుణాలను మాఫీ చేస్తామంటూ హామీ ఇద్దామని చాలా మంది తనకు చెప్పారన్నారు. అయితే చేయలేనిది చెప్పకూడదని.. మాట ఇస్తే తప్పకూడదని ఆ రోజు తాను చెప్పానన్నారు.

ఆ రోజు తాను అధర్మం చేయని కారణంగా, అబద్ధం ఆడనందుకు ఒక్క శాతం ఓట్ల తేడాతో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నానని తెలిపారు. ఒక్క అబద్ధం చెప్పి ఉంటే ఆ రోజే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేవాడినన్నారు. కానీ ఈ రోజు కూడా తనకు ఎలాంటి రిగ్రేట్‌ లేదన్నారు. దీని నుంచి వెనక్కి వెళ్లి మళ్లీ అబద్ధం చెప్పబోనని జగన్‌ తేల్చిచెప్పారు.

తన నోట్లో నుంచి అబద్ధాలు రావని జగన్‌ స్పష్టం చేశారు. తాను ఆ రోజు చేసిన పని వల్ల అధికారంలోకి రాకపోవచ్చన్నారు. అయితే విశ్వసనీయత అన్న పదానికి అర్థం జగనే అని ప్రజలు నమ్మారని గర్వంగా చెబుతున్నానన్నారు.

టీడీపీ హయాంలో రాబడి, అప్పులు, ఖర్చులను వివరిస్తూ.. వైఎస్సార్‌సీపీ వచ్చాక పరిస్థితి ఎలా ఉందో జగన్‌ వివరించారు. అంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొని కూడా గత సర్కారు చేయని విధంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించామని తెలిపారు. డీబీటీ, నాన్‌ డీబీటీ పథకాలతో ప్రజలకు మొత్తం రూ.4.31 లక్షల కోట్లను అందించామని గుర్తు చేశారు.

గత ప్రభుత్వ విధానాలతో కీలకమైన విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత కుదేలయ్యాయని జగన్‌ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 2018 మార్చిలో విడుదల చేసిన నివేదికను గమనిస్తే విద్యారంగంలో జీఈఆర్‌ రేషియో జాతీయ స్థాయిలో 96.91 శాతం ఉంటే మన రాష్ట్రంలో 83.29 శాతమే ఉందన్నారు. ఆ డేటా చూస్తే అమ్మ ఒడి పథకం ఎంత అవసరమో అందరికీ అర్థమవుతుందని తెలిపారు. గత సర్కారు హయాంలో ప్రై మరీ స్కూళ్ల­లో విద్యార్థుల నమోదులో రాష్ట్రం చివరి నుంచి మూడో స్థానంలో ఉందని చెప్పారు. దాన్ని తమ ప్రభుత్వం ఏ స్థాయికి తీసుకొచ్చిందో గణాంకాలు చూస్తే అర్థమవుతుందన్నారు.

చంద్రబాబు రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారని జగన్‌ ఆరోపించారు. 2014 ఎన్నికల సమయంలో రూ.87 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని దగా చేశారని మండిపడ్డారు. ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మోసంతో రైతుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా పథకం అందించి తోడుగా నిలిచామని గుర్తు చేశారు. అలాగే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని అక్కచెల్లెమ్మలను కూడా చంద్రబాబు మోసం చేశారన్నారు. సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేస్తానని దగా చేశారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పొదుపు సంఘాలకు జీవం పోశామని వెల్లడించారు.

హైదరాబాద్‌ లాంటి నగరం లేకపోవడం, విభజన వల్ల రాష్ట్రం ఏటా రూ.13 వేల కోట్లను ఆదాయపరంగా నష్టపోతున్నామని జగన్‌ వెల్లడించారు. ఇలా ఈ పదేళ్లలో రూ.1.35 లక్షల కోట్లు నష్టపోయామన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో చట్టంలోనైనా ప్రత్యేక హోదా ఇస్తామని పొందుపరచి ఉంటే మనం కోర్టుకు వెళ్లి తెచ్చుకునేవాళ్లమన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారని ఆరోపించారు. చట్టంలో చేర్చకపోవడంతో ప్రత్యేక హోదా ఎండమావిగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికార పార్టీకి పూర్తి మెజారిటీ లేకపోతే, మన మద్దతు అడిగిన వారిని ప్రత్యేక హోదా కోసం గట్టిగా డిమాండ్‌ చేయగలిగేవాళ్లమని తెలిపారు.

Tags:    

Similar News