అండా దండా సీఎం రమేష్ అంట...!
మా అండ దండా నీవేనయ్య సామీ అని అనకాపలి పార్లమెంట్ పరిధిలోని టీడీపీ కూటమి అభ్యర్ధులు కోరస్ పాడుతున్నారు.
మా అండ దండా నీవేనయ్య సామీ అని అనకాపలి పార్లమెంట్ పరిధిలోని టీడీపీ కూటమి అభ్యర్ధులు కోరస్ పాడుతున్నారు. సీఎం రమేష్ కి బీజేపీ తరఫున ఎంపీ టికెట్ కేటాయించారు అనడంతోనే చాలా మంది టీడీపీ కూటమి అభ్యర్ధులు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. అంగబలం అర్ధబలం దండీగా ఉన్న సీఎం రమేష్ వంటి బిగ్ షాట్ తమతో పాటు ఉంటే ఆర్ధికంగా ఇబ్బందులు ఏవీ రావు అన్న భరోసా అయితే కూటమి పెద్దలలో కనిపిస్తోంది.
సీఎం రమేష్ అభ్యర్ధిత్వంతో ఒక్కసారిగా అన్ని అసంతృప్తులూ గాలికి ఎగిరిపోయాయి. సీఎం రమేష్ కి ఘన స్వాగతం పలికిన తీరే దానికి నిదర్శనం. తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వలేదని పార్టీ మీద అలిగి కొంతకాలం మౌనవ్రతం పాటించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇపుడు సీఎం రమేష్ ఎన్నికలకు ప్రధాన వ్యూహకర్తగా మారిపోయారు.
మొత్తం తానే అయి నడిపిస్తున్నారు. రమేష్ తమ పార్టీకి చెందిన ఒకనాటి సహచరుడు కావడంతో కూడా ఆయన మరింతగా చొరవ తీసుకుంటున్నారు. అదే నాగబాబు జనసేన అభ్యర్థిగా ప్రకటించాక ఎంత రచ్చ జరిగింది అన్నది అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్లుగా తిరిగి చివరికి తప్పుకున్నారు.
దానికి కారణం బిగ్ షాట్ గా నాగబాబు ఉన్నా ఆయన ఎంత వరకూ ఖర్చు చేస్తారు అన్నది తెలియకపోవడం వల్లనే కూటమి పెద్దలలో అసంతృప్తి కనిపించింది అని అంటున్నారు. ఇక టీడీపీ మొదటి నుంచి అనకాపల్లి ఎంపీ సీటుని బిగ్ షాట్ కి ఇవ్వాలని చూస్తూ వచ్చింది. అలా బీజేపీ నుంచి కధని సానుకూలం చేసుకుంది అని అంటున్నారు.
సీఎం రమేష్ కి అనకాపల్లి తెలియదు, కానీ నాయకులకు ఏమి చేయాలో బాగా తెలుసు అని అంటున్నారు. కూటమి నాయకులతో ఆయన చర్చలు జరిపారు. వారి మద్దతు కోరుకున్నారు. దాంతో ఎంపీ అయినంత లెవెల్ లో రమేష్ కి అనకాపల్లిలో స్వాగతం లభించింది. తొలిసారి ఆయన అనకాపల్లికి వచ్చినా ఆయన ఫస్ట్ టూరే అదిరిపోవాలని ప్లాన్ చేసి మరీ సక్సెస్ చేశారు.
ఇక ఈ మధ్య దాకా నాన్ లోకల్ కి టికెట్ ఇస్తారా ఎంపీ సీటు లోకల్ కే ఇవ్వండి అంటూ నినదించిన కూటమి పెద్దలు అంతా పది జిల్లాలు దాటుకుని మరీ వచ్చిన రమేష్ వైపు మొగ్గు చూపడమే అసలైన రాజకీయం నాగబాబు పక్కన ఉన్న గోదావరి జిల్లాల వారే అయినా ఆయన నాన్ లోకల్ అయిపోయారు. కానీ ఎక్కడో కడపకు చెందిన రమేష్ మాత్రం బాగా దగ్గర అయ్యారు.
ఆయన్ని గెలిపించి అనకాపల్లిని అభివృద్ధి చేసుకోవాల్సిందే అని నాయకులు అంతా స్పీచులు ఇస్తున్నారు. అయితే నాయకులకు రమేష్ నచ్చారు. ఆయన అభ్యర్ధిత్వం నచ్చింది. కానీ పూర్తిగా లోకల్ వాళ్ళకే ఓటు వేసే అనకాపల్లి జనం చైతన్యాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయకూడదు అని అంటున్నారు. వారు తీసుకునే నిర్ణయమే విజేతను డిసైడ్ చేస్తుంది అని అంటున్నారు.
మా లీడర్ పక్కా లోకల్. మంచికి మారు పేరు, అజాత శత్రువు. నేల మీద నిలిచే మనిషి. ఆయనది జన బలం అని వైసీపీ నేతలు బూడి ముత్యాల నాయుడు గురించి చెబుతున్నారు. ఆయన వైసీపీ ఎంపీగా అనకాపల్లి నుంచి గెలిచి తీరుతారు అని వారు అంటున్నారు. ధనబలం వర్సెస్ జనబలం అన్నట్లుగా అనకాపల్లి ఎన్నికను అభివర్ణిస్తున్నారు. మరి ఈ విషయంలో జనం మాట ఏమిటి అన్నది చూడాల్సి ఉంది.