రంగంలోకి సీఎం రమేష్...ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ !

ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ సీటుకు ఉప ఎన్నిక ఆగస్టు 30న జరగనుంది.

Update: 2024-08-04 11:02 GMT

ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ సీటుకు ఉప ఎన్నిక ఆగస్టు 30న జరగనుంది. వైసీపీ చాలా వ్యూహాత్మకంగా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరుని ప్రకటించింది. మొత్తం 830 ఓట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నాయి. వైసీపీకి 615 ఓట్లు టీడీపీ కూటమికి 215 ఓట్లు ఉన్నాయి.

ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా ఏకంగా 400 దాకా ఉంది. దాంతో పాటు సీనియర్ నేత బొత్స దిగడంతో ఆయన తనదైన వ్యూహాలతో ఎలాగైనా గెలిచి వస్తారని అంటున్నారు. మరో వైపు కూటమిలో చూస్తే సీనియర్ నేతలు చాలా మంది ఉన్నా మంత్రి పదవులు దక్కని వారు కొంత మౌనం పాటిస్తున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాకు ఏకైక మంత్రిగా వంగలపూడి అనిత ఉన్నారు. ఆమె మీదనే ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత పడుతోంది. ఈ నేపధ్యంలో వైసీపీ అభ్యర్ధిని ముందే ప్రకటించి కొంత అడ్వాన్స్ పొజిషన్ లో ఉందని అంటున్నారు. అయితే దాన్ని తిప్పికొట్టేలా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ రంగంలోకి దిగిపోయారు.

రమేష్ దిగితే ఇక విజయమే అని కూడా అంతా అంటున్నారు. ఆయన అతి తక్కువ సమయంలో విశాఖ జిల్లా అనకాపల్లికి ఎంపీగా ఎంపిక చేయబడినా అందరినీ కలుపుకుని భారీ ఆధిక్యతతో విజయం సాధించడం అంతా చూశారు. అంగబలం అర్థబలంతో పాటు ధీటైన వ్యూహాలు రూపొందించే ఆయన్ని తట్టుకోవడం కష్టమే అని అంటున్నారు.

గతంలో కూడా కడప జిల్లాలో స్థానిక కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరిగినపుడు వైసీపీకి మెజారిటీ ఉన్నా సీఎం రమేష్ వంటి వారు తమ చాకచక్యం చూపించి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి గెలిచేలా చక్రం తిప్పారు. ఇపుడు కూడా సీఎం రమేష్ రంగంలోకి దిగడంతో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది అని అంటున్నారు.

సీఎం రమేష్ బీజేపీకి చెందిన ఎంపీగా ఉన్నా టీడీపీతో ఆయనకు నాలుగు దశాబ్దాల పరిచయం ఉంది. దాంతో ఆయన చొరవ తీసుకుని అనకాపల్లిలో ఒక మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారి పేర్లను షార్ట్ లిస్ట్ చేసి నలుగురి జాబితాని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారు. అందులో బీజేపీకి చెందిన ఈర్లె శ్రీరామమూర్తి తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్, మాడుగుల టీడీపీ ఇంచార్జ్ పీవీజీ కుమార్ ఉన్నారు.

ఇందులో చంద్రబాబు ఏ పేరు ఆమోదించినా వారిని గెలిపించుకుందామని రమేష్ చెబుతున్నారు. సీఎం రమేష్ నిర్వహించిన ఈ సమావేశానికి టీడీపీ జనసేన బీజేపీ నేతలు అంతా హాజరు అయ్యారు. అలాగే ఎమ్మెల్యేలు సైతం హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికను రమేష్ ప్రతిష్ట గా తీసుకున్నారని ఈ సమావేశం బట్టి అర్ధం అవుతోంది.

చంద్రబాబు కూడా రమేష్ మీదనే భారం ఉంచుతున్నట్లుగా చెబుతున్నారు. ఇక విశాఖ సిటీ నుంచి ఎవరైనా పోటీ చేయదలచుకున్నరా అన్న దానిని కూడా చూసుకుని అభ్యర్ధి పేరుని టీడీపీ నేడో రేపో ఫైనలైజ్ చేస్తుంది అని అంటున్నారు. నంబర్ గేం మీదనే ఆధారపడిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాలే కీలక పాత్ర పోషిస్తాయి. ఇపుడు సీఎం రమేష్ ఫుల్ ఫోకస్ పెట్టడంతో వైసీపీ కూడా అలెర్ట్ కావాల్సిన అవసరం ఏర్పడింది.

వైసీపీలో బొత్స అభ్యర్ధిత్వం పట్ల అసంతృప్తి ఉంటే కనుక కూటమి నుంచి వారిని ఆకర్షించడం సులువు అని అంటున్నారు. అలాగే అధికారం చేతిలో ఉంది. మరో అయిదేళ్ళ పాటు తమతోనే పనులు ఉంటాయి కాబట్టి లోకల్ బాడీ ప్రజా ప్రతినిధులను ఆకట్టుకోవడం పైన కూడా దృష్టి సారిస్తున్నారు. ఏది ఏమైనా సీఎం రమేష్ రంగంలోకి దిగిపోవడంతో ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పూర్తి ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News