ఎన్నికల వేళ అవినాష్ అరెస్ట్ అంటూ...!?

ఇటువంటి సమయంలో వైసీపీకి చెందిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ బీజేపీ నేత అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-23 03:39 GMT

ఏపీలో కీలకమైన ఎన్నికల ఘట్టంలో అంతా ఉన్నారు. వేడిగా వాడిగా రాజకీయం సాగుతోంది. ఇటువంటి సమయంలో వైసీపీకి చెందిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ బీజేపీ నేత అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఎవరూ అడ్డుకోలేరు అని ఆయన ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం అయితే దానికి కొంత సమయం పడుతుందని ఆయనే చెప్పారు. అవినాష్ రెడ్డి గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పూర్తిగా తెలుసు అని ఆయన అన్నారు.

అవినాష్ రెడ్డి కేసు విషయంలో పూర్తి వివరాలు కేంద్ర హోం శాఖ వద్ద ఉన్నయని కూడా అన్నారు. ఏడాది క్రితమే తనకు అమిత్ షా దీని మీద చెప్పారని కూడా రమేష్ అనడం విశేషం. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ వచ్చిందని, అయితే అయితే జనాలను మధ్యలో ఉంచుకుని నాడు అరెస్ట్ కాకుండా అవినాష్ రెడ్డి తప్పించుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

అలా ఆ రోజున అవినాష్ రెడ్డి తప్పించుకోవచ్చు, కానీ ఆయన అరెస్ట్ కాకుండా ఎపుడూ తప్పించుకోలేరని దానికి సమయం మాత్రమే రావాల్సి ఉందని సీఎం రమేష్ అన్నారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో కోర్టులలో కొన్ని విషయాలు ముడిపడి ఉన్నాయని అందుకే టైం పడుతోందని రమేష్ అంటున్నారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాల పుట్ట అని రమేష్ ఆరోపించారు. ఆ విషయం కూడా కేంద్ర పెద్దలకు తెలుసు అని అన్నారు. వారు కూడా ఏపీ ప్రభుత్వం తీరు గురించి అన్నీ గమనిస్తున్నారని వారికి పూర్తి సమాచారం ఉందని ఆయన అన్నారు.

వైసీపీ అయిదేళ్ల పాలనలో అనేక తప్పులను చేసిందని అయితే వాటికి బీజేపీకి రుద్దాలని చూసిందని కానీ బీజేపీ వారికి అన్నీ తెలుసు అని అవినీతికి ఎట్టి పరిస్థితుల్లోనూ వారు అంగీకరించరని ఆయన స్పష్టం చేశారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ తో తెర వెనక సూత్రధారులు కూడా బయటపడతారు అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఏపీలో ఎన్నికల వేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అని సంచలన వ్యాఖ్యలను కూటమి అభ్యర్ధిగా ఉన్న సీఎం రమేష్ చేయడంతో ఎన్నికల తరువాత జరగబోయే పరిణామాల గురించి ఆయన చెబుతున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.

Tags:    

Similar News