సంకీర్ణ ప్రభుత్వమే అంటున్న అయ్యన్న...!
టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వస్తుంది అని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు జోస్యం చెబుతున్నారు.
తమ్ముళ్ల టోన్ మారుతోంది. నిన్నటిదాకా ఏపీలో వచ్చేది మేమే అని చెప్పిన వారు కూడా ఇపుడు సంకీర్ణ ప్రభుత్వం అంటున్నారు. టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వస్తుంది అని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు జోస్యం చెబుతున్నారు.
ఆ జోస్యమేదే సోలోగా టీడీపీయే వస్తుంది అని మాత్రం చెప్పకపోవడమే వెలితిగా ఉంది. ఇప్పటిదాకా ఎన్నో పార్టీలతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. 2014లో బీజేపీతో పొత్తు కలిపి బరిలోకి దిగింది. ఆనాడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు సీఎం అవుతారు అని ధీమాగా ప్రకటించుకుంది.
ఇపుడు మాత్రం టీడీపీ జనసేన ప్రభుత్వం అని తలపండిన నేతలు సైతం అంటున్నారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎక్కడా చెప్పడంలేదు. ఈ రాజకీయ లౌక్యం ఏమిటో తమ్ముళ్లకు అర్ధం కావడంలేదు. సామాన్య ప్రజలకు కూడా అసలు అర్ధం కాదు అనే అంటున్నారు.
ఏపీలో చూస్తే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 40 శాతం దాకా ఓటు షేర్ వచ్చింది. జనసేనకు ఆరేడు శాతం వచ్చింది. ఈ రోజుకు చూసినా ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాలలో టీడీపీ బలంగా ఉంది. సంస్థాగతంగా పట్టు ఉంది. అయినా సరే టీడీపీ ప్రభుత్వం వస్తోంది, చంద్రబాబే మన సీఎం అని చెప్పకపోవడం రాజకీయ బలహీనతగానే చూస్తున్నారు.
అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 నాటికి 2023 నాటికి సాధించిన అతి పెద్ద విజయం ఇదే అని కూడా అంటున్నారు. ఆయన టీడీపీ పెద్దలందరి మెడలో జనసేన కండువా వేయించారు. ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో ప్రకటించకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని అనిపించగలిగారు. ఇంతకంటే పవన్ గెలిచేది వేరేగా ఏముంటుందని అంటున్నారు.