చీరాలలో గందరగోళం
ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్‌కు చీరాల టికెట్ ఇస్తున్నట్టు పెద్ద ఎత్తున బ్యానర్లు వెలిశాయి.
వచ్చే 2024 ఎన్నికలకు సంబంధించి పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను ఖరారు చేస్తున్న విష యం తెలిసిందే. ఈ క్రమంలో కీలకమైన చీరాల నియోజకవర్గంలో అభ్యర్థిని కూడా ఖరారు చేసినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్‌కు చీరాల టికెట్ ఇస్తున్నట్టు పెద్ద ఎత్తున బ్యానర్లు వెలిశాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై చర్చ సాగుతోంది. ఇక, నిత్యం వెంకటేష్ ఏదో ఒక పోస్టుతో హల్చల్ చేస్తున్నారు.
అయితే... ఈ పరిణామం స్థానికంగా ఉన్న వైసీపీ కేడర్‌కు మింగుడు పడడం లేదు. తమను సంప్రదించ కుండానే.. తమకు ఒక్కమాట కూడా చెప్పకుండానే వెంకటేష్‌కు టికెట్ ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నా రు. ముఖ్యంగా పార్టీ నుంచి బయటకు వెళ్లి జనసేనలో చేరిన ఆమంచి స్వాములు.. ఈ విషయంలో వైసీపీ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ కేడర్ అంతా కూడా.. స్వాములు చేతిలోనే ఉందని, ఆయన చెప్పినట్టు నడుచుకుంటున్నారనేది ప్రచారంలో ఉంది.
వాస్తవానికి ఈ టికెట్‌ను ఆమంచి కృష్ణమోహన్‌కు ఇవ్వాల్సి ఉన్నా..ఆయనను పరుచూరుకు తరలించా రు. అయితే.. కరణం బలరాంకు ఇస్తారని అందరూ అనుకున్నారు.కానీ, వెంటనే వెంకటేష్ తెరమీదికి వచ్చారు. అంతేకాదు..తనను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు ఆయనతో విభేదిస్తున్నారు. తమపై కేసులు పెట్టించారని.. తమను కలుపుకొని పోవడం లేదని.. ఆయనకు టికెట్ ఎలా ఇస్తారని అంటున్నారు.
దీంతో వెంకటేష్‌కు వ్యతిరేకంగా మరో వర్గం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోంది. వైసీపీ చీరాలను వదులుకోవాల్సిందేనని అంటున్నారు. ఈ పరిణామాలు నియోజకవర్గంలో గందరగోళంగా మారాయి. అయితే.. పాత టీడీపీ కేడర్‌ను నమ్ముకున్న కరణం.. వర్గంవారిని ఇంటింటికీ వెళ్లి పలకరిస్తుండడం మరో కోణం. వారికి పనులు కూడా చేసి పెడుతున్నారు. దీంతో వైసీపీలో ఉంటూ.. టీడీపీ నేతలను కలవడం పైనా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.