కూల్చివేతలపై అధిష్ఠానం అగ్రహం.. సీఎం రేవంత్ కు తలంటు?
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసేలా అధికార కొరడాను సామాన్యుల మీద ఝుళిపించొద్దని ఏఐసీసీ పెద్దలు రేవంత్ కు సూచన చేసినట్లుగా చెబుతున్నారు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్ఠానం క్లాస్ పీకిందా? ఇటీవల కాలంలో ప్రభుత్వం చేపట్టిన చెరువుల పరిరక్షణ.. మూసీ సుందరీకరణలో భాగంగా కూల్చివేతలు చేపట్టిన వైనంపై పార్టీ అధినాయకత్వం అగ్రహంగా ఉందా? తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రికి క్లాస్ పడిందా? అన్న విషయంపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేసే విషయంలో ఆచితూచి అన్నట్లు వ్యవహరించాలని కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ కు హితోపదేశం చేసినట్లుగా పేర్కొన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసేలా అధికార కొరడాను సామాన్యుల మీద ఝుళిపించొద్దని ఏఐసీసీ పెద్దలు రేవంత్ కు సూచన చేసినట్లుగా చెబుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న బుల్డోజర్ విధానంపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరు చేస్తున్న వేళ.. అదే తీరును కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో అమలు చేయటాన్నిపార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ హితోపదేశం చేసినట్లుగా చెబుతున్నారు.
సామాన్యుల ఆస్తులపై కొరడా ఝుళిపించటం ద్వారా పార్టీకి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు పేర్కొంటున్నారు. జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేను పరామర్శించేందుకు వెళ్లిన సీఎం రేవంత్ కు.. రాష్ట్ర పరిస్థితులు.. పాలనపై తమకు వచ్చిన ఫిర్యాదులను రేవంత్ ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది. అనంతరం పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో విడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు.. కూల్చివేతల విషయంలో ఒకేలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.
హైడ్రా.. మూసీ సుందరీకరణ విషయంలో ప్రభుత్వ స్టాండ్ ను సీఎం రేవంత్ వివరించినా.. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. చెడ్డపేరు వద్దని చెప్పినట్లుగా సమాచారం. డెవలప్ మెంట్ పేరుతో ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలతో ముందుగా నష్టపోయేది రోడ్డున పడేది నిమ్న వర్గాల ప్రజలేనని.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వంటి వాటిల్లో నిందితులు ఒకరైతే.. బాధితులు వేరే వారు ఉంటారన్న మాటను చెప్పినట్లుగా సమాచారం.
సామాన్యుల పట్ల ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుందన్న అపవాదు ప్రభుత్వం ఒకసారి యూటకట్టుకుంటే దానిని తుడిచేయటం అంత సులువు కాదన్న అధినాయకత్వం.. సంయమనంతో వ్యవహరించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఓవైపు ఉత్తరప్రదేశ్..మధ్యప్రదేశ్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూల్చివేతలపై కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలోనూ కూల్చివేతలు ఉండటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లుగా తెలుస్తోంది. మొత్తంగా రేవంత్ కు తాజా ఢిల్లీ ట్రిప్ లో పెద్ద క్లాస్ పడినట్లుగా ప్రచారం జరుగుతోంది.