సున్నా - ఒకటి మధ్య కొట్టిమిట్టాట... హస్తానికి మరో హ్యాట్రిక్ తప్పదా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతానికి... ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ (36) స్థానాలు దాటి ఆధిక్యంలో దూసుకెళ్తుండగా.. ఇప్పటికే హస్తినను మూడు సార్లు పాలించిన ఆప్ కి నాలుగో ఛాన్స్ లేనట్లు కనిపిస్తోంది.
ఉదయం 10:30 గంటల ప్రాంతంలో వెలువడుతున్న ఎన్నికల ఫలితాల ప్రకారం.. భారతీయ జనతాపార్టీ 42 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా.. ఆప్ 28 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ రెండు పార్టీల సంగతి కాసేపు పక్కనపెడితే.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి కాసేపు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంటే.. మరి కాసేపు అక్కడ సున్నా కనిపిస్తుంది.
అవును... ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ వెలువడుతున్న ఫలితాల ప్రకారం సున్నాకు ఒకటికి మధ్య కొట్టిమిట్టాడుతోందని అంటున్నారు. 2013 వరకూ వరుసగా 15 ఏళ్లు పాలించిన ఆ పార్టీ నేడు ఈ స్థితిలోకి చేరుకోవడంపై ఆ పార్టీకి ఉన్న కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
వాస్తవానికి ఈ తరహా ఘోర ఫలితాలు హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదనే చెప్పాలి. 2015 ఎన్నికల్లోనూ ఇలానే సున్నా స్థానాలకు పరిమితమైన ఆ పార్టీ 2020 ఎన్నికల్లోనూ ఏమాత్రం మార్పు లేకుండా తమ పనితీరు కనబరిచింది! దీంతో.. ఈ సారి పూర్తి ఫలితాలు వెలువడే సమయానికి పరిస్థితి ఇలానే ఉంటే.. సున్నా స్థానాలతో హ్యాట్రిక్ కొట్టినట్లే అని అంటున్నారు.
కాగా.. ఢిల్లీలో 2013 నుంచి ఆప్ ప్రభుత్వమే అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేజ్రీవాల్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. అటు ఆ పార్టీని గద్దె దించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ పాలనా పగ్గాలు అందుకోవాలని భారతీయ జనతా పార్టీ చూస్తోంది.