రేవంత్.. వైఎస్సార్ పాలనను కాపీ కొట్టు.. చంద్రబాబుని కాదు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన పాలన మరువలేనిది.

Update: 2024-09-13 16:30 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన పాలన మరువలేనిది. ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ ఇప్పటికీ ఆయనకు అభిమానులు అలానే ఉన్నారని చెప్పాలి. వైఎస్సార్ హయాంలో ఆయన అమలు చేసిన పథకాలు గడపడగడపకూ చేరడంతోనే ఆయనపై అందరికి అంత అభిమానం అని రాజకీయ ప్రముఖులు అంటుంటారు.

వైఎస్సార్‌ నిత్యం పేదల కోసం ఆలోచించే వ్యక్తి అని అందరూ చెబుతుంటారు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఆయన పేదల పథకాల కోసం ఆలోచించారని.. పేదలకు నీడ అయ్యారని రాజకీయాలకతీతంగా కొనియాడుతుంటారు. ఆయన హయాంలో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, తాగు, సాగునీటి కోసం ప్రాజెక్టులకు జలయజ్ఞం వంటి పథకాలు ఇప్పటికీ ప్రజల మనస్సులో నుంచి తొలగిపోలేదు. ప్రభుత్వాలు మారినా.. ఆ పథకాలు ఇంకా కొనసాగుతున్నాయంటే వైఎస్సార్ మార్క్ అర్థం చేసుకోవచ్చు.

వైఎస్సార్ తన పథకాలతో కేవలం ప్రజలకు దగ్గరకావడమే కాదు.. అటు కాంగ్రెస్ పార్టీలోనూ తనకున్న ఇమేజీని ఎవరూ అందుకోలేకపోయారు. ఒంటి చేత్తో రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పార్టీని అధికారంలో తీసుకొచ్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అటు రాజకీయాల్లోనూ ఆయనకు ప్రతిపక్ష నేతలు కూడా అభిమానులుగా ఉన్నారు. పార్టీలకతీతంగా ఆయన వద్దకు వచ్చి కలుస్తుండేవారు.

కట్ చేస్తే.. ఆయన మరణం తరువాత పరిస్థితులు ఎలా అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆ వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. దాంతో రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. పదేళ్ల పాటు అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ పార్టీ కష్టాలనే చవిచూడాల్సి వచ్చింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక దశాబ్ద కాలం తరువాత రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ కొలువుదీరింది. పదేళ్లకు మళ్లీ అధికారం దొరికింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే.. రేవంత్ రెడ్డికి పాలనాపరంగా అంతగా అనుభవం లేకపోవడంతో పలువురు నిపుణులు, కాంగ్రెస్‌వాదులు పలు సూచనలు ఇస్తున్నారట. అందుకు.. వైఎస్సార్ పాలనను ఆయనకు ఉదాహరణగా వివరిస్తున్నారంట. రేవంత్ రెడ్డిని సక్సెస్ ఫుల్ ముఖ్యమంత్రిని చేసేందుకు వారు తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారట.

ఇందుకు.. వైఎస్సార్ హయాంలో నడిచిన పాలనా విధానం.. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. ఆయన ఉండే విధానాన్ని రేవంత్ రెడ్డికి చెబుతున్నారట. వైఎస్సార్ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆయనకు ఉన్న ధైర్యం అంతాఇంతా కాదని, దేనిని కూడా లెక్క చేయకుండా ఆయన ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటుండే వారని రేవంత్‌కు బోధిస్తున్నారని తెలుస్తోంది. ఏదైనా చేయాలనిపిస్తే దానిని వెంటనే అమల్లోకి తెచ్చేవారని నిపుణులు చెబుతున్నారట.

ఇదేక్రమంలో వైఎస్సార్, చంద్రబాబు పాలనను పోల్చిచెబుతున్నారని టాక్ నడుస్తోంది. వైఎస్సార్ ఎవరికీ అదరకుండా బెదరకుండా నిర్ణయాలు తీసుకునే వారని, చంద్రబాబు మాత్రం నానబెట్టి కొసరికొసరి నిర్ణయాలు తీసుకుంటారని వివరిస్తున్నారట. అందుకే.. చంద్రబాబు ఏనాడూ సొంతంగా గెలిచిన దాఖలాలు లేవని.. ఎన్నికలు వచ్చాయంటే పొత్తు కోసం వెంపర్లాడుతారని వారు రేవంత్ రెడ్డితో అన్నారని సమాచారం. వైఎస్సార్ హయాంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అయినా సింగిల్‌గానే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని వివరించారని తెలుస్తోంది. వైఎస్సార్ అందరి సలహాలు సూచనలు తీసుకుంటూనే.. ఏ పార్టీ వ్యక్తిని అయినా చేరదీసేవారని చెప్పారట. అలాగే.. ఏ పార్టీ నుంచి సలహాలు, విజ్ఞప్తులు వచ్చినా వాటిపై ఆలోచించి నిర్ణయం తీసుకొని అమలు చేసేందుకు సిద్ధపడేవారని రేవంత్‌కు బోధిస్తున్నారని సమాచారం. అయితే.. చంద్రబాబు విషయానికి వచ్చేసరికి వారికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే వైఖరి ఆయనది అని హితబోధ చేశారని టాక్ నడుస్తోంది.

ముఖ్యమంత్రిగా ఊహించని విధంగా వచ్చిన అవకాశం అని.. పాలనపరంగా, రాజకీయాల పరంగా వైఎస్సార్ మాదిరి ఉండి సొంత ఇమేజీని పెంచుకోవాలని కాంగ్రెస్‌వాదులు ఆయనకు సూచిస్తున్నట్లు సమాచారం. తగిన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు చేరువ అవుతూనే.. అటు పార్టీ పరంగానూ బలాన్ని చాటాలని కోరారని టాక్. పాలనలో కానీ,.. పార్టీ పరంగా కానీ చంద్రబాబును కాకుండా వైఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచిస్తున్నారట. వైఎస్సార్ ఆలోచనలను, ఆయన సాహసాలను, ఆయన నిర్ణయాలను కాపీ కొట్టు కానీ చంద్రబాబును అనుసరిస్తే మొదటికే మోసం వస్తుందని తమ స్టైల్‌లో హెచ్చరించినట్లుగానూ తెలుస్తోంది.

Tags:    

Similar News