బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇద్దరు మహిళా నేతలకు సెగే.. !
అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో ఇటు అంసెబ్లీలోనూ.. అటు పార్లమెంటులోనూ ఇద్దరు నాయకులు తమ సత్తా చాటాల్సిన అవసరం ఉంది.
రెండు ప్రధాన జాతీయ పార్టీలకు ఎన్నడూ లేని విధంగా మహిళలే అధ్యక్షులుగా ఉన్నారు. వారే.. బీజేపీ ఏపీ చీఫ్‌గా దగ్గుబాటి పురందేశ్వరి, కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల. వీరిద్దరూ కూడా మాజీ ముఖ్యమంత్రు ల కుమార్తెలుగా అందరికీ సుపరిచితమే. అందునా.. ఆ ఇద్దరు ముఖ్యమంత్రులకు కూడా ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. అది ఇప్పటికీ పదిలంగానే ఉండడం మరో విశేషం. ఈ నేపథ్యంలోనే రెండు జాతీయ పార్టీలు కూడా ఈ ఇద్దరు మహిళా నాయకులకు ప్రాధాన్యం ఇచ్చాయి.
అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో ఇటు అంసెబ్లీలోనూ.. అటు పార్లమెంటులోనూ ఇద్దరు నాయకులు తమ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. పైగా.. ఈ రెండు పార్టీల పరిస్థితి దాదాపు ఒకే చట్రంలో ఇరుక్కుంది. రాష్ట్రానికి అన్యాయం చేసిందన్న ఆవేదన కాంగ్రెస్‌పై ఉంటే.. విభజన హామీలను అమలు చేయడం లేదని, పార్లమెం టు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హోదా హామీనిసైతం బుట్టదాఖలు చేశారని, రాజదాని అమరావతికి శంకుస్థాపన చేసిన తర్వాత.. ప్రధాని మోడీ ఈ విషయాన్ని తనకు సంబంధం లేదన్నట్టుగా వదిలేశారనే వాదన బీజేపీపైనా ఉంది.
అంటే.. ఇరు పార్టీల విషయంలోనూ లోపాల సారూప్యత, ప్రజల్లో భావన ఒకే విధంగా కనిపిస్తోంది. మరో వైపు ఓటు బ్యాంకు విషయాన్ని తీసుకున్నా.. ఈ రెండు పార్టీల వ్యవహారం దొందు దొందే అన్నట్టుగా ఉం దనే అభిప్రాయం కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు కనీసం ఒక శాతం ఓటు బ్యాంకు కూడా ఇప్పుడు లేదనేది తెలిసిందే. బీజేపీ పరిస్థితి కూడా అంతేలా ఉంది. 2014లో నాలుగు సీట్లు గెలుచుకున్నా.. తర్వాత వాటిని నిలబెట్టుకోలేక పోయింది. ఒక ఎమ్మెల్సీ స్థానం(మాధవ్) దక్కినా దాని పరిస్థితి అలానే తయారైంది.
అంటే.. అటు కాంగ్రెస్ అయినా.. ఇటు బీజేపీ అయినా.. రెండు కూడా జీరో నుంచే ఇప్పుడు పని మొదలు పెట్టాలి. ఏమీ లేని స్థాయి, స్థితిల నుంచి రాజకీయాలు ప్రారంబించాలి. ఈ బాధ్యత విషయంలో రెండు పార్టీల జాతీయ అధిష్టానాలు.. అటు పురందేశ్వరి, ఇటు షర్మిలపై పెట్టాయి. పైగా ఇరువురు నాయకులకు కలిసి వచ్చే అంశాలు పెద్దగా కనిపించడం లేదు. షర్మిలను తీసుకుంటే.. తండ్రి సానుభూతి కొంత పనిచేస్తుందని అనుకున్నా.. పురందేశ్వరికి అలాంటి సానుభూతి లేనేలేదు. సో.. మొత్తంగా చూస్తే.. ఇరువురు మహిళలకు సెగ మామూలుగా తగిలే పరిస్తితి లేదని అంటున్నారు పరిశీలకులు.