14 నుండి బస్సుయాత్ర ?

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణా కాంగ్రెస్ తొందరలోనే బస్సుయాత్రకు రెడీ అవుతోంది.

Update: 2023-10-07 09:37 GMT

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణా కాంగ్రెస్ తొందరలోనే బస్సుయాత్రకు రెడీ అవుతోంది. ఎన్నికలు అయ్యేవరకు రెగ్యులర్ గా ప్రజల్లోనే ఉండాలని అధిష్టానం గట్టిగా ఆదేశించింది. దానికితోడు పార్టీ విషయంలో జనాల్లో పాజిటివ్ దృక్పధాన్ని పెంచటం కోసం అవకాశం ఉన్న ప్రతిచర్యను తీసుకోవాలని సీనియర్లు గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే వివిధ వర్గాలను ఆకర్షించేందుకు డిక్లరేషన్లని, సిక్స్ గ్యారెంటీలని రకరకాల హామీలను ఇచ్చారు. దీనికి అదనంగా బస్సుయాత్ర మొదలుపెట్టబోతున్నారు.

అయితే ఈ బస్సుయాత్రకు ఒక కండీషన్ ఉంది. అదేమిటంటే టికెట్లను ప్రకటించే తేదీ ఆధారంగా యాత్ర తేదీల్లో మార్పులు జరిగే అవకాశముంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఒక్కజాబితాను కూడా విడుదలచేయలేదు. ఒకవైపు బీఆర్ఎస్ 114 టికెట్లను ప్రకటిస్తే కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటంటే ఒక్క జాబితాను కూడా ప్రకటించలేదు. బీజేపీకి అంటే గట్టినాయకుల కొరత ఉంది కాబట్టి అభ్యర్ధులను ప్రకటించలేకపోతోంది. మరి కాంగ్రెస్ కు ఏమైంది ? ఏమైందంటే నేతలతో ఓవర్ లోడ్ అయిపోయింది.

అందుకనే అభ్యర్ధుల ప్రకటన వాయిదాలు పడుతోంది. ఈనెల 11వ తేదీన మొదటిజాబితాను ప్రకటించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. వివాదాలు లేని కనీసం 45 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేందుకు అధిష్టానం రెడీ అవుతోందని సమాచారం. 9-10 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని అందరు అనుకుంటున్నారు. ఇదే జరిగితే 11వ తేదీన మొదటిజాబితా విడుదలవుతుందని అనుకుంటున్నారు. జాబితా విడుదలైతే ముందుగా అనుకున్నట్లుగానే బస్సుయాత్ర 14 లేదా 15వ తేదీన మొదలవుతుందని పార్టీవర్గాల సమాచారం.

బస్సుయాత్ర, షెడ్యూల్ ను సీనియర్లు రెడీ చేస్తున్నారు. పనిలోపనిగా ఈనెల 18-20 తేదీల్లో రాహుల్ గాంధి హైదరాబాద్ లో ఉంటారని కూడా పార్టీవర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాహుల్ ఆధ్వర్యంలో రోడ్డుషోలు జరిపేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్న విషయం తెలిసిందే. ఇందులో కూడా ఓల్డ్ సిటిలోనే ఏడు నియోజకవర్గాలున్నాయి. అందుకనే ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సమాచారం. మొత్తానికి ఎన్నికలు దగ్గరకు వచ్చేకొద్దీ సీనియర్లలో ఫుల్లుజోష్ పెరిగిపోతోంది.

Tags:    

Similar News