బీఆర్ఎస్ ట్రాప్ లో కాంగ్రెస్ పడుతుందా?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ జోరు మీదుంది. రాష్ట్రంలో పార్టీకి ఏర్పడుతున్న సానుకూల పరిస్థితులను విజయానికి మెట్లుగా మార్చుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఉంది
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ జోరు మీదుంది. రాష్ట్రంలో పార్టీకి ఏర్పడుతున్న సానుకూల పరిస్థితులను విజయానికి మెట్లుగా మార్చుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఉంది. అందుకే ప్రచారంలోనూ దూకుడు చూపిస్తోంది. మరోవైపు చేరికలను భారీగా ప్రోత్సహిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను చేర్చుకుంటోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలను ఎలాంటి సందేహాలు లేకుండా కండువాలు కప్పి ఆహ్వానిస్తోంది. కానీ ఇదే ఇప్పుడు పార్టీకి నష్టం చేస్తుందా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు ప్రాధాన్యతనిస్తున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్ ట్రాప్ లో పడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అధికార బీఆర్ఎస్ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీలో అగ్ర నేతలకు కొదవలేదు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చే నాయకులను చేర్చుకుంటోంది. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు, తుమ్మల నాగేశ్వర రావు, మైనంపల్లి హన్మంత రావు, వేముల వీరేశం లాంటి నేతలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారు. మోత్కుపల్లి నర్సింహులు తదితర బీఆర్ఎస్ నాయకులు కూడా త్వరలోనే హస్తం గూటికి వెళ్లనున్నారు. రాబోయే రోజుల్లో ఈ చేరికలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది.
ఇప్పటివరకూ అంతా బాగానే ఉంది. కానీ.. అసలు సమస్య ఇప్పుడే మొదలవనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ లో ప్రాధాన్యత దక్కడం లేదని, టికెట్ రాలేదనే నిరాశతో చాలా మంది నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. అలాంటి నాయకులకు టికెట్లు కేటాయించడం ఇప్పుడు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతల కోసం తమను పక్కనపెట్టడంపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారని తెలిసింది. బయట నుంచి వచ్చిన వారి కోసం తమ నియోజకవర్గాలను త్యాగం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లోనే టికెట్ల మధ్య హోరాహోరీ పోటీ ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు మధ్యలో వచ్చి.. ఆధిపత్యం చలాయించడం ఏమిటని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ ట్రాప్ లో కాంగ్రెస్ పడుతుందనే అభిప్రాయాలున్నాయి. తమ పార్టీ నుంచి వెళ్లే నాయకుల వల్ల కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు తారస్థాయికి చేరతాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తెలియంది కాదు. దీనివల్ల అంతిమంగా లబ్ధి పొందేది కేసీఆర్ అని విశ్లేషకులు చెబుతున్నారు.