రాహుల్ చాలా ఆశలు పెట్టుకున్నారా ?
మీడియాతో రాహుల్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో విజయం ఖాయమన్నారు. రాజస్థాన్లో పోటీపోటీగా ఉన్నా గెలుపు కాంగ్రెస్ దే అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చాలా ఆశలే పెట్టుకున్నట్లు కనబడుతోంది. తొందరలోనే జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి విజయాలను సాధిస్తుందన్నారు. మీడియాతో రాహుల్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో విజయం ఖాయమన్నారు. రాజస్థాన్లో పోటీపోటీగా ఉన్నా గెలుపు కాంగ్రెస్ దే అన్నారు. తెలంగాణాలో కూడా గెలిచేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పారు. మరి మిజోరంను ఎందుకు వదిలేశారో తెలీటం లేదు.
నిజానికి కాంగ్రెస్ చేతగాని తనం వల్లే మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నది. పోయిన ఎన్నికల్లో ఎంపీలో కాంగ్రెస్సే గెలిచింది. అయితే గ్రూపు రాజకీయాల కారణంగా పార్టీ నిలువుగా చీలిపోవడం తో బీజేపీ అధికారాన్ని అందుకుంది.
అలాంటి రాష్ట్రంలో ఇపుడు కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నట్లు ప్రీ పోల్ సర్వేలు చెబుతున్నాయి. రాజస్ధాన్, తెలంగాణాలో పరిస్ధితిని అంచనా వేయటం కష్టమే. ఛత్తీస్ ఘడ్ లో గెలుపు అవకాశాలు కనబడతున్నాయి.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే తెలంగాణతో పాటు పై రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు అనివార్యం. తెలంగాణాలో ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయిన పార్టీ మూడోసారి కూడా ఓడిపోతే పార్టీ బతకటం కష్టమే. అలాగే పై రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కు అదనపు లాభం కూడా ఉంటుంది.
ఏమిటంటే రాజ్యసభలో బలం పెంచుకుంటుంది. పై రాష్ట్రాల్లో గెలిస్తే కనీసం 20 మందిని కాంగ్రెస్ రాజ్యసభకు పంపగలుగుతుంది. అంటే ఈ మేరకు బీజేపీకి మైనస్సనే అనుకోవాలి. తర్వాత జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు రాబడితే కాంగ్రెస్ కు లోక్ సభలో కూడా బలం పెరుగుతుంది.
అంటే పార్లమెంటులోని ఉభయసభల్లో కాంగ్రెస్ బలం కాస్త పెరిగి, బీజేపీ బలం తగ్గుతుంది. ముఖ్యంగా రాజ్యసభలో ఈ ప్రభావం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే మీద పెద్ద ప్రభావం చూపుతుంది. అప్పుడు జాతీయస్ధాయిలో బీజేపీకి కాంగ్రెస్ బలమైన ప్రత్యమ్నాయంగా ఎదుగుతుంది అనటంలో సందేహంలేదు. ప్రతిపక్షాలు బలంగా ఉంటే నరేంద్రమోడీ ఇపుడు తీసుకుంటున్నట్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అప్పుడు ఉండవు. ఏదేమైనా ప్రతిపక్షాలు బలంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిదే కదా.